Jammu Kashmir: ‘కశ్మీర్‌వాసుల భద్రతకు భరోసా ఇవ్వాలి’

జమ్మూ- కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గురువారం ఓ పాఠశాలలోకి చొరబడిన ఉగ్రవాదులు.. ప్రధానోపాధ్యాయురాలితోపాటు మరో ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికార, విపక్ష నేతలు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించారు...

Published : 08 Oct 2021 23:10 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గురువారం ఓ పాఠశాలలోకి చొరబడిన ఉగ్రవాదులు.. ప్రధానోపాధ్యాయురాలితోపాటు మరో ఉపాధ్యాయుడిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికార, విపక్ష నేతలు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించారు. తాజాగా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ దాడిని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌వాసులకు పకడ్బందీ భద్రత అందించాలని డిమాండ్‌ చేశారు. ‘కశ్మీరీయులపై పెరుగుతున్న ఉగ్ర దాడులు బాధాకరం. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ కష్ట సమయంలో మేమంతా కశ్మీర్‌వాసుల వెంట ఉన్నాం’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవడంతోపాటు పౌరులందరి భద్రతకు భరోసా ఇవ్వాలన్నారు.

కశ్మీర్‌ లోయలో ముష్కరులు గత ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులను బలిగొనడంతో స్థానికంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో లోయలో శాంతికి భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కేంద్రం ఆరోపించింది. ఉగ్రవాదులు త్వరలోనే ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జమ్మూ- కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం 28 మంది పౌరులు మృతి చెందినట్లు జమ్మూ- కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని