Updated : 25 Apr 2022 16:10 IST

Pak boat: పాక్ పడవలో ₹280కోట్ల విలువైన హెరాయిన్‌.. పట్టుకున్న భారత్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌ తీరంలో మరోసారి భారీ ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత కలకలం రేపింది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తోన్న వందల కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకొన్నారు. ఆ పడవలోని తొమ్మిది మంది సిబ్బందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్‌ చేశారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సోమవారం వెల్లడించారు.

అరేబియా సముద్రం మీదుగా హెరాయిన్‌ స్మగ్లింగ్‌ జరుగుతోన్నట్లు నిఘా వర్గాల సమాచారం రావడంతో ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌, గుజ‌రాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) సంయుక్తంగా నిన్న రాత్రి ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ క్రమంలోనే భారత్‌ వైపు వస్తోన్న పాకిస్థాన్‌ పడవ ‘అల్‌ హజ్‌’ను అధికారులు అడ్డుకున్నారు. అందులో తనిఖీలు నిర్వహించగా.. భారీ ఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. పడవలోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. తదుపరి విచారణ నిమిత్తం బోటును కచ్‌ జిల్లాలోని జాఖౌ తీరానికి తరలించారు.

అరేబియా సముద్రం మీదుగా హెరాయిన్‌ అక్రమ రవాణా భారత్‌కు పెను సమస్యగా మారుతోంది. హెరాయిన్‌ మత్తుమందుగా మారాక వీటి అక్రమ వ్యాపారం భారత్‌కు రెండు వైపులా వేళ్లూనుకుంది. ఒక వైపు  అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌-ఇరాన్‌లతో కూడిన ‘బంగారు నెలవంక’ (అంతర్జాతీయంగా దీనికి ఉన్న పేరు) మరో వైపు బర్మా-లావోస్‌-థాయిల్యాండ్‌తో కూడిన ‘బంగారు త్రికోణం’ ఉన్నాయి. తాజాగా గుజరాత్‌ తీరంలో పట్టుకున్న హెరాయిన్‌ అఫ్గాన్‌ నుంచి పాక్‌ మీదుగా తరలించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 

హెరాయిన్‌ ఎలా పుట్టింది..?

1850 సమయంలో అమెరికాలో నల్లమందు అలవాటు విపరీతంగా ఉండేది. దీనిని మాన్పించడం కోసం తక్కువ ప్రభావం ఉన్న అనుబంధ ఔషధం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మార్ఫిన్‌ అనే ఔషధాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అది నల్లమందును మించి ప్రజలను బానిసలుగా చేసుకొంది. ఈ క్రమంలో 1898లో జర్మనీకి చెందిన ఔషధ సంస్థ బేయర్‌ ఫార్మ క్షయవ్యాధికి ఔషధంగా హెరాయిన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే సమయంలో మార్ఫిన్‌ మత్తు నుంచి బయటపడటానికి కూడా దీనిని వాడారు. అది కూడా మార్ఫిన్‌ను మించి ప్రభావం చూపడం మొదలుపెట్టింది. దీనిని మాన్పించడానికి మెథాడోన్‌ అనే ఔషధం తయారు చేశారు. అది కూడా దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది. హెరాయిన్‌ వాడేవారికి చనిపోయే అవకాశాలు 20 రెట్లు అధికంగా ఉంటాయని 1990లో నిర్ధారించారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని