
afghanistan: అమెరికా వదిలేసిన ఆయుధాలతో భారత్‌లో విధ్వంసం!
వాటిని పాకిస్థాన్‌కు విక్రయిస్తున్న అఫ్గాన్ తాలిబన్లు
ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్‌ను వీడుతూ అక్కడ అమెరికా వదిలేసిన అధునాతన ఆయుధాలను చేజిక్కించుకునేందుకు పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతోంది. తాలిబన్లు వాటిని ఇప్పటికే పాక్‌కు విక్రయించినట్టు పలు నివేదికలు వెల్లడించాయి. భారత్‌లో విధ్వంసం సృష్టించే లక్ష్యంతో వీటిని ఉగ్రవాద సంస్థలకు అందించే ముప్పు ఉన్నట్టు హెచ్చరించాయి. అఫ్గాన్‌లో రెండు దశాబ్దాలపాటు పోరాటం సాగించిన అమెరికా... ఈ ఏడాది ఆగస్టులో అక్కడి నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. తన ఆయుధ సంపత్తిని భారీస్థాయిలో అక్కడే వదిలేసినట్టు నివేదికలు వెల్లడించాయి. ఈ అత్యాధునిక ఆయుధాలను అఫ్గాన్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసినట్టు ఓ నివేదిక ధ్రువీకరించింది. ఇవి నిషేధిత ‘తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్’ చేతికి వెళ్లనున్నాయని, ఈ మేరకు ఆ సంస్థ ఇమ్రాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొంది. అఫ్గాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి ముందే.. అక్కడున్న అత్యాధునిక ఆయుధాలను ధ్వంసం చేసినట్టు అమెరికా రక్షణశాఖ కార్యాలయం వెల్లడించిన క్రమంలో న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాలిబన్ల చేతికి వేల ఆయుధాలు చిక్కాయని పేర్కొంది. వారు కాబుల్‌ను ఆక్రమించిన తర్వాత... అఫ్గాన్ ఆర్మీ నుంచి అమెరికా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుని పాకిస్థాన్‌కు సరఫరా చేసినట్లు వెల్లడించింది. అఫ్గాన్ డీలర్లు అమెరికా ఆయుధాలను నేరుగా దుకాణాల్లోనే విక్రయిస్తున్నట్టు హెచ్చరించింది.
పాకిస్థాన్‌కే ముప్పు...
అఫ్గాన్ నుంచి కొనుగోలు చేస్తున్న అమెరికా ఆయుధాలతో ఉగ్రవాద సంస్థలు ముందుగా పాకిస్థాన్‌లోనే విధ్వంసం సృష్టించే ప్రమాదముందని భారత్ పేర్కొంది. ‘‘అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా ఆయుధాలు పాక్‌కు తరలినట్టు మాకు సమాచారం ఉంది. తాలిబన్ల విజయంతో పాక్‌లోని ఉగ్ర ముఠాలకు ధైర్యం వచ్చింది. ఆ ఆయుధాలను ఉగ్రవాదులు ముందుగా పాకిస్థాన్‌లోనే ఉపయోగించే ప్రమాదముంది. కొన్నింటిని భారత్‌లోని ఉగ్రవాద సంస్థలకూ సరఫరా చేయొచ్చు. కానీ, వాటిని వినియోగించే ప్రయత్నాలను పూర్తిస్థాయిలో అడ్డుకుంటాం’’ అని సీనియర్ సైనికాధికారులు చెప్పారు.