Drone: పాక్‌ నుంచి డ్రగ్స్‌తో డ్రోన్‌.. కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌ మహిళా సిబ్బంది

అమృత్‌సర్‌లోని భారత్‌ - పాక్‌ సరిహద్దులో డ్రోన్‌ సంచారం కలకలం సృష్టించింది. పాకిస్థాన్‌ నుంచి మాదకద్రవ్యాలు మోసుకొస్తున్న ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చేశారు.

Updated : 29 Nov 2022 13:28 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్‌ సరిహద్దులో డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా కుట్రలను సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) భగ్నం చేశాయి. పాకిస్థాన్‌ నుంచి నార్కోటిక్స్‌ తీసుకొస్తున్న ఓ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ మహిళా సిబ్బంది దాన్ని కూల్చేశారు. అందులో 3.1 కేజీల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అమృత్‌సర్‌లోని చహర్‌పూర్ గ్రామంలో గల భారత్‌ - పాక్‌ సరిహద్దు వద్ద మోహరించిన బలగాలు.. సోమవారం రాత్రి 11.05 గంటల సమయంలో ఓ డ్రోన్‌ పాకిస్థాన్‌ వైపు నుంచి రావడం గుర్తించాయి. అప్రమత్తమైన దళాలు వెంటనే యాంటీ డ్రోన్ వ్యవస్థతో కాల్పులు జరిపి ఆ డ్రోన్‌ను కూల్చివేసినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత చేపట్టిన తనిఖీల్లో పాక్షికంగా ధ్వంసమైన ఓ హెక్సాకాప్టర్‌ను భద్రతాసిబ్బంది గుర్తించారు. 18 కేజీల బరువున్న ఈ డ్రోన్‌లో 3.11 కేజీల నార్కోటిక్స్‌ ఉన్నట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా గూఢచర్యం, స్మగ్లింగ్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితం నవంబరు 25న, అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ పాకిస్థానీ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని