
BSF: పాక్ సరిహద్దులో డ్రోన్ కలకలం.. హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్ సంచారం కలకలం సృష్టించింది. పాక్ వైపు నుంచి పంజాబ్‌లోని అమృత్సర్ సెక్టార్‌లోకి ప్రవేశించిన ఓ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాల్పులతో కట్టడి చేసింది. అనంతరం సంబంధిత ప్రదేశం నుంచి ఏడు కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.
‘బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ వైపు నుంచి ఓ డ్రోన్ వస్తున్నట్లు గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై దానిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ నుంచి ఏవో వస్తువులు కిందపడిపోయినట్లు గుర్తించి.. వెంటనే ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హెరాయిన్‌గా భావిస్తున్న ఏడు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొత్తం 7.2 కిలోల బరువున్నాయి’ అని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. మరోసారి దేశ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలను విఫలం చేసినట్లు బీఎస్ఎఫ్ పేర్కొంది. మాదకద్రవ్యాల రవాణాపై పోరాటానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అంతకుముందు మంగళవారం సైతం ఇక్కడి బీఎస్ఎఫ్ సిబ్బంది బార్డర్ ఫెన్సింగ్ సమీపంలో ఒక డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు, డ్రగ్స్‌తో ఇవి భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ సింగ్ చెప్పారు.