MEA Report: చైనాతో సంబంధాలు సంక్లిష్టం.. భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం!

సరిహద్దులో ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో చైనాతో భారత్‌ సంబంధాలు సంక్లిష్టంగా మారాయని భారత విదేశీ వ్యవహారాలశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అటు పాకిస్థాన్‌ కూడా సొంత దేశంలో సమస్యలపై దృష్టి మరల్చేందుకే భారత్‌పై దుష్ప్రచారం కొనసాగిస్తోందని స్పష్టం చేసింది.

Published : 13 Mar 2023 22:58 IST

దిల్లీ: కొంతకాలంగా భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇరు దేశాల సైనిక, దౌత్యపరంగా సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో సఫలీకృతం కావడం లేదు. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ (LAC) వెంట యథాతథస్థితిని మార్చేందుకు చైనా చేస్తోన్న ఏకపక్ష చర్యలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని భారత విదేశాంగ శాఖ (MEA) వెల్లడించింది. అటు పాకిస్థాన్‌ కూడా 26/11 ముంబయి ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో శ్రద్ధ చూపలేదని స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాలశాఖ వార్షిక నివేదిక 2021-22లో ఈ వివరాలు వెల్లడించింది.

‘వెస్టర్న్‌ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంట యథాతథస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ఏప్రిల్‌-మే 2020 నుంచి చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీంతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు, అశాంతికి దారితీస్తున్నాయి. ఇటువంటి చర్యలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఇదే సమయంలో సైనిక, దౌత్య మార్గాల ద్వారా భారత్‌ సంప్రదింపులు జరపడం కొనసాగిస్తోంది’ అని వార్షిక నివేదికలో విదేశాంగశాఖ పేర్కొంది.

‘పాకిస్థాన్‌లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాల నుంచి దృష్టి మరల్చేందుకు భారత్‌ను దూషిస్తూ అసత్య ప్రచారాలు చేయడంలో దాయాది దేశం నిమగ్నమైంది. భారత అంతర్గత విషయాలపై పాక్‌ చేసే వ్యాఖ్యలు, అవాస్తవాలను భారత్‌ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు తన భూభాగాన్ని అనుమతించవద్దని 2004లో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పాక్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. నియంత్రణ రేఖ వెంట చొరబాట్లు, అక్రమ ఆయుధాల సరఫరా వంటి వాటికి అనుమతిస్తూనే ఉంది’ అని విదేశాంగశాఖ నివేదిక తెలిపింది. ఈ అంశాలపై పాకిస్థాన్‌ను ఎప్పటికప్పుడు భారత్‌ హెచ్చరిస్తూనే ఉందని స్పష్టం చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని