కోర్టు ప్రాంగణంలో పాక్‌ అనుకూల నినాదాలు.. గ్యాంగ్‌స్టర్‌కు దేహశుద్ధి

విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లగా ఆ ప్రాంగణంలో గ్యాంగ్‌స్టర్‌ జయేశ్‌ పూజారి పాక్‌ అనుకూల నినాదాలు చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Published : 13 Jun 2024 00:11 IST

బెంగళూరు: జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ కర్ణాటకలోని బెళగావి న్యాయస్థాన ప్రాంగణంలో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కేసు విచారణలో భాగంగా గ్యాంగ్‌స్టర్‌ జయేశ్‌ పూజారిని (Jayesh Pujari) కోర్టుకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. పాక్‌ నినాదాలు చేయడంతో అక్కడున్నవారు అతడిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గ్యాంగ్‌స్టర్‌ జయేశ్‌ పూజారిపై హత్య, బెదిరింపులు వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో దోషిగా తేలిన అతడు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ క్రమంలో 2018 నాటికి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా పూజారిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. లోపలికి వెళుతుండగా అతడు హఠాత్తుగా పాక్ అనుకూల నినాదాలు చేశాడు. దీంతో భద్రత కల్పించిన పోలీసులు అతడిని అక్కడినుంచి తరలించారు. అసలు అతడు ఎందుకు నినాదాలు చేశాడో తెలియలేదని.. దానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

టికెట్‌ లేని ప్రయాణికులతో వందే భారత్‌ రష్‌.. స్పందించిన రైల్వే శాఖ

నినాదాలు చేయడంతో అక్కడున్నవారు అతడికి దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఇదిలాఉండగా.. రూ.10 కోట్లు డిమాండ్‌ చేస్తూ గతేడాది కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావడం కలకలం రేపింది. ఈ బెదిరింపులకు పాల్పడింది తానేనంటూ జయేశ్‌ పూజారీగా అలియాస్‌ జయేశ్‌కాంతగా అంగీకరించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని