Pak-IMF talks: రుణసాయం కోసం అభ్యర్థన.. పాక్‌కు మరోసారి భంగపాటు

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి రుణం పొందేందుకు చేసిన ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి.....

Updated : 24 Nov 2022 12:53 IST

ఇస్లామాబాద్‌: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి రుణం పొందేందుకు చేసిన ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి బిలియన్ డాలర్ల రుణం సహా ఆర్థిక వ్యవస్థ బాగుంది అనే ధ్రువీకరణ పత్రం పొందేందుకు ఐఎంఎఫ్‌తో పాక్‌ జరిపిన రెండో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. పాక్‌ సమర్పించిన ఆర్థిక ప్రణాళికపై ఐఎంఎఫ్‌ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, ఆ దేశ ఆర్థిక పరిస్ధితిపై అనిశ్చితి నేపథ్యంలో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం తెలిపింది. అదనపు పన్నుల విధింపు, పాకిస్థాన్ విద్యుత్ రంగ ఆర్థిక స్థిరత్వంపై ఐఎంఎఫ్‌ ప్రతిపాదించిన మార్గసూచీకి పాక్ అంగీకరించలేదని వెల్లడించింది. 525 బిలియన్ రూపాయల అదనపు పన్నులు విధించాలని ఐఎంఎఫ్‌ సూచించగా, పాక్  300 బిలియన్ రూపాయలు మాత్రమే విధిస్తామని తెలిపినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. రుణం కోసం ఐఎంఎఫ్‌,పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది జూన్‌లో జరిగిన తొలి విడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి.

2019లో పాక్‌-ఐఎంఎఫ్‌ మధ్య 6 బిలియన్‌ డాలర్ల రుణం కోసం ఒప్పందం జరిగింది. అయితే 2020 జనవరిలో ఆ ఒప్పందం నిలిచిపోయింది. కానీ, ఈ ఏడాది మార్చిలో మళ్లీ దాన్ని పునరుద్ధరించారు. జూన్‌-ఆగస్టు మధ్యలో పెద్దగా చర్చలు ఏమీ జరగలేదు. ఇప్పటి వరకు ఐఎంఎఫ్‌ కూడా చర్చలకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కాగా పాక్‌ ఆర్థిక మంత్రి షౌకత్‌ తారిన్‌ ఈ చర్చలను వేగవంతం చేయడంతో ఈ నెల 11వ తేదీ నుంచి నేటి వరకు వరకు ఐఎంఎఫ్‌తో సమావేశం జరిగింది. కాగా ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని