
Pakistan: పాకిస్థాన్ పౌరుల డేటాబేస్ హ్యాక్!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదం, ఆర్థిక ఇబ్బందులు, విదేశాలతో విభేదాలు తదితర సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు తాజాగా సైబర్ దాడి రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పాకిస్థాన్ పౌరులకు సంబంధించిన డేటాబేస్ హ్యాక్‌కు గురైనట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) ఆ దేశ పార్లమెంట్ ప్యానెల్‌కు సమాచారం ఇచ్చింది.
పాకిస్థాన్ పౌరులకు సంబంధించిన అన్ని వివరాలను నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ(నాడ్రా) నమోదు చేస్తుంటుంది. ప్రతి పౌరుడికి చెందిన బయోమెట్రిక్ సహా సమస్త వివరాలు నాడ్రా డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రజలకు గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టు జారీ చేసే అధికారం కూడా కేవలం నాడ్రాకి మాత్రమే ఉంది. అంతటి కీలకమైన డేటాబేస్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఎఫ్‌ఐఏ అధికారులు వెల్లడించారు. అలా దొంగలించిన పౌరుల డేటాతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిమ్‌కార్డులు జారీ అవుతున్నట్లు గుర్తించామని, ఇప్పటి వరకు పంజాబ్ ప్రావిన్స్‌లో 13వేల సిమ్‌కార్డులను సీజ్ చేశామని పార్లమెంట్ కమిటీకి తెలిపారు. నష్టనివారణ చర్యలు సైతం ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఐఏ అధికారులు నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్‌కు వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.