
Pak-china: పాక్.. మా బ్యాంకులు సిద్ధంగా లేవు..!
మిత్రుడికి మొండి చేయి చూపిన చైనా
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పుడు తెల్ల ఏనుగుల్లా మారాయి. ఇవి పాక్ ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పి చేస్తున్నాయి. వీటి రుణాలు చెల్లించకపోతే పోర్టులు, ప్లాంట్లు, భూములు.. ఇలా దేనినైనా చైనా లీజుపేరుతో ఆక్రమించుకొనే ముప్పు ఉంది. మరోపక్క పాకిస్తాన్ తీసుకున్న రుణాలు కొండలా పేరుకుపోయాయి. ఇది చాలదన్నట్లు ఇతర దేశాల నుంచి తెచ్చిన అరువులు కూడా తోడయ్యాయి. ఫలితంగా పాక్ రుణభారం దేశ జీడీపీని మించిపోయింది. దీంతో ఆదుకోమంటూ మళ్లీ చైనా గుమ్మం ఎక్కిన పాక్‌కు నిరాశే ఎదురైంది. ‘మీకు సాయం చేయాలంటే మా బ్యాంకులు రూల్స్ మార్చుకోవాలి.. కుదరదు’ అంటూ మొండి చెయ్యి చూపింది చైనా.
అసలేం జరిగింది..
తాను చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్ల రుణాన్ని రీస్ట్రక్చర్ చేయమని పాకిస్తాన్ డ్రాగన్‌ను కోరింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో నిర్మించిన పవర్ ప్లాంట్లకు సంబంధించిన ఈ బకాయిల విషయంలో సాయం చేసేందుకు చైనా నిరాకరించింది. సీపెక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు 31 బిలియన్ డాలర్ల రుణ భారం పాక్‌పై పడింది.
కొన్నేళ్ల క్రితం పాక్‌లో విద్యుత్తు కొరత ఉండటంతో ప్రైవేటు కంపెనీల నుంచి ‘టేక్ ఆర్ పే’ విధానంలో పవర్ జనరేషన్ కాంట్రాక్టులు కుదుర్చుకొని విద్యుత్తు కొనడం మొదలుపెట్టింది. దీంతో సీపెక్ కింద సమకూర్చిన 19 బిలియన్ డాలర్లను వెచ్చించి ప్రైవేటు కంపెనీలు విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించినట్లు ఏషియా టైమ్స్ పత్రిక వెల్లడించింది. కానీ, పాక్‌లో పంపిణీ వ్యవస్థకు సంబంధించి గ్రిడ్ లేదు. ఉత్పత్తి చేసిన విద్యుత్తు మొత్తం ఉపయోగించుకొనే పరిస్థితి లేదు. దీంతో ఆ విద్యుత్తును పాక్ సర్కారు కొన్నా.. కొనకపోయినా కంపెనీలకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు విద్యుత్తు కంపెనీలకు 2025 నాటికి 5.9 బిలియన్ డాలర్లు బకాయి ఉంటుందని అంచనా. అందులో దాదాపు సగభాగమే ఇప్పుడు రీస్ట్రక్చర్ చేయమన్న 3 బిలియన్ డాలర్లు.
అధిక రేట్లకు విద్యుత్తు కొనేందుకు ఈ ప్రైవేటు ప్రాజెక్టులతో నేషనల్ ఎలక్ట్రిక్ పవర్ రెగ్యులేటరి అథారిటీ ఒప్పందాలు కుదుర్చుకొందని పీటీఐ పార్టీ సెనెటర్ నుమాన్ వాజ్రి ఆరోపించారు.
చైనా స్పందన ఇదీ..
పాక్ విన్నపంపై చైనా నుంచి తెలివిగా సమాధానం వచ్చింది. ఇప్పటికే ఇచ్చిన రుణాల నిబంధనలు, ఇతర అంశాలపై మరోసారి చర్చించడం కుదరదని పేర్కొంది. పాక్ ఈ రుణాలకు సంబంధించి ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే చైనా బ్యాంకుల నిబంధనలను సవరించాల్సి వస్తుందని పేర్కొంది. చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా.. రుణాల నిబంధనల్లో ఎలాంటి మార్పుల గురించి చర్చించేందుకు సిద్ధంగా లేవని వెల్లడించింది.
అప్పుల కుప్పగా దాయాది..
పాక్ ప్రభుత్వ అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2020 డిసెంబర్ నాటికి అప్పులు 294 బిలియన్ డాలర్లకు చేరుకొన్నాయి. ఇది పాకిస్తాన్ జీడీపీలో 109 శాతానికి సమానం. దేశీయ రుణదాతలకే 158.9 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. విదేశీ అప్పులు దాదాపు 115 బిలియన్ డాలర్లు ఉన్నాయి. పారిస్ క్లబ్ నుంచి 11 బిలియన్ డాలర్లు, వివిధ దేశాల నుంచి 33 బిలియన్ డాలర్లు, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లకు పైగా పాక్ సమీకరించింది. అంతేకాదు, బాండ్ల రూపంలో కూడా అంతర్జాతీయంగా 12 బిలియన్ డాలర్ల నిధులను తీసుకొచ్చింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్‌కు 12.233 బిలియన్ డాలర్లు వస్తాయని బడ్జెట్‌లో ఇమ్రాన్ ఖాన్ సర్కారు అంచనా వేయగా.. ఇప్పటి వరకు వచ్చింది 7.208 బిలియన్ డాలర్లు మాత్రమే. వీటిలో విదేశీ వాణిజ్య రుణాలు 3.11 బిలియన్ డాలర్లు, మిగతాది చైనా సేఫ్ డిపాజిట్ల రూపంలో వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో 59శాతం మాత్రమే లభించింది.