Pakistan: పాక్‌.. రఫేల్‌ శక్తి తెలుసా..?

‘‘చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్‌ యుద్ధవిమానం జె-20 భారత్‌కు చెందిన రఫేల్‌ యుద్ధవిమానంతో ఏమాత్రం పోటీపడలేదు. రఫేల్‌ రాకతో చైనా శిబిరంలో ఆందోళన నెలకొంది’’ ఫిబ్రవరిలో మీడియాతో

Updated : 31 Dec 2021 14:20 IST

 చైనా జె-10సితో పోలుస్తూ.. పాక్‌ ఆత్మ సంతృప్తి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘‘చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్‌ యుద్ధ విమానం జె-20.. భారత్‌కు చెందిన రఫేల్‌ యుద్ధవిమానంతో ఏమాత్రం పోటీపడలేదు. రఫేల్‌ రాకతో చైనా శిబిరంలో ఆందోళన నెలకొంది’’ ఫిబ్రవరిలో మీడియాతో మాట్లాడుతూ భారత వాయు సేన మాజీ చీఫ్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ వ్యాఖ్యల వెనుక బలమైన ఆధారాలున్నాయి. చైనా యుద్ధ విమానం జె-20ని.. అమెరికా ఎఫ్‌-22 రాఫ్టర్‌ టెక్నాలజీని దొంగిలించి తయారు చేశారు. 2009లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో రఫేల్‌ విమానం.. ఎఫ్‌-22 రాఫ్టర్‌పై తేలిగ్గా గురిపెట్టగలిగింది. ఇది అమెరికాతో సహా ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది.

ఈ నేపథ్యంలో చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్‌ జెట్‌ జె-20ని కూడా రఫేల్‌ తేలిగ్గా ఎదుర్కోగలదు. మరి జె-20 కంటే తక్కువ సామర్థ్యం ఉన్న  జె-10సి ఫైటర్‌ జెట్‌లు భారత్‌ రఫేల్ విమానాలకు పోటీ ఇస్తాయని పాక్‌ మంత్రి గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఈ రెండు విమానాలను చెంగ్డూ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇండస్ట్రీస్‌ తయారు చేస్తోంది.

అసలేమిటీ జె-10సి ఫైటర్‌ జెట్‌

జె-10 విమానాలను జియాన్‌-10 అని అంటారు. నాటోదళాలు దీనిని ‘ఫైర్‌బర్డ్‌’ అని పిలుస్తాయి. ఇది గగనతల, భూతల దాడులు చేయగల మల్టీరోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌. 1994లో తొలిసారి దీనిని పరీక్షించారు. ఇది చూడటానికి అమెరికా ఎఫ్‌-16ను పోలి ఉంటుంది. దీని అప్‌గ్రేడెడ్‌ జె-10సి వేరియంట్‌ను చైనా అభివృద్ధి చేసింది. 2018లో ఆ దేశ వాయుసేనలో ఇది చేరింది. ఈ విమానానికి చైనాలో తయారైన డబ్ల్యూఎస్‌-10 ఇంజిన్‌ను అమర్చారు. దీనిని రష్యాకు చెందిన ఏఎల్‌-31 ఆధారంగా అభివృద్ధి చేశారు. దీని జీవితకాలం 1,500 గంటలకు పెంచినట్లు చైనా పత్రికలు వెల్లడించాయి. ఈ విమానంలో అత్యాధునిక ఏఈఎస్‌ఏ రాడార్‌ అమర్చారు. 4.5 జనరేషన్ యుద్ధవిమానంగా దీనిని డ్రాగన్‌ చెప్పుకొంటోంది. ఈ విమానం అన్ని ఫీచర్లతో పాక్‌కు అందదు. దీని ఎక్స్‌పోర్టు వేరియంట్‌ మాత్రమే పాకిస్థాన్‌కు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఫీచర్లు తగ్గే అవకాశం ఉంది. ఈ విమానం పీఎల్‌ -10, పీఎల్‌-15 క్షిపణులను ప్రయోగించగలదు. ఇప్పటి వరకూ ఏ యుద్ధాల్లోనూ వినియోగించలేదు. ఈ నేపథ్యంలో దీని సామర్థ్యంపై కచ్చితమైన అంచనాలు లేవు. నిపుణులు ఈ విమానాన్ని ఎఫ్‌-16, మిగ్‌-29లకు పోటీగా చూస్తున్నారు.

రఫేల్‌తో పోటీపడగలదా..?

వాస్తవానికి వైమానిక రంగంలో పశ్చిమ దేశాల సాంకేతికతకు తిరుగులేదు. ఈ రంగంలో ఫ్రాన్స్‌, అమెరికా మధ్యే ప్రధాన పోటీ. ఫ్రాన్స్‌కు చెందిన డసో తయారు చేసిన రఫేల్‌ను ఇప్పటికే మాలీ, అఫ్గానిస్థాన్‌, సిరియా,లిబియా,ఇరాక్‌ల్లో జరిగిన యుద్ధాల్లో వినియోగించారు. ఆ యుద్ధాల్లో దీని సామర్థ్యం నిరూపించుకొంది. సుఖోయ్‌-30 సామర్థ్యానికి మించిన దాడుల్లో వాడేందుకు భారత్‌ దీనిని కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి స్కాల్ప్‌, మైకా, మెటియోర్‌ వంటి క్షిపణులను దీనిలో వినియోగిస్తారు. రఫేల్‌ విమానాల తయారీకి డసో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ‘కతియ’ అంటారు. విమానంలో అత్యంత చిన్న భాగాలను కూడా దీనిలో డిజైన్‌ చేసి పరీక్షించిన తర్వాతే వినియోగించారు. రఫేల్‌లో ‘బడ్డీ-బడ్డీ’ రీఫ్యూయలింగ్‌ వ్యవస్థ ఉంది. ఫలితంగా దీని రేంజ్‌ గణనీయంగా పెంచవచ్చు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. ఈ విమానంపై ‘స్పెక్ట్రా’ అనే ఎలక్ట్రానిక్‌ యుద్ధతంత్ర వ్యవస్థ( వార్ఫేర్‌సూట్‌) ఉంది. ఇది శత్రువుల రాడార్లను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతోపాటు దూసుకొచ్చే క్షిపణులను తప్పించేలా ప్రత్యేకమైన విద్యుదయస్కాంత తరంగాలను వదులుతుంది. ఈ విమానంలో అమర్చిన ఎం88 ఇంజిన్‌ జీవితకాలం 6,000 గంటలు. జె-10సీ ఇంజిన్‌తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ.

జె-10సీకు అంత సీన్‌ లేదన్న పాక్‌ నేత..

పాక్‌ వద్ద ఇప్పటికే చైనా తయారీ జె-17 యుద్ధవిమానాలు ఉన్నాయి. అవి ఇంజిన్లు లేక మూలనపడ్డాయి. రఫేల్‌కు పోటీ అంటూ పాక్‌ జె-10సీలను కొనుగోలు చేయడం వివాదాస్పదమైంది. పాక్‌ సెనెటర్‌ డాక్టర్‌ అఫ్నాన్‌ ఉల్లా ఖాన్‌ దీనిని తప్పుబట్టారు. ‘ఇప్పటికే మన దగ్గర జె-10సీ వంటి ఎఫ్‌-16లు ఉన్నాయి. జె-10సీ రఫేల్‌ అంత శక్తిమంతమైన విమానం అని నేను అనుకోను. ఈ డబ్బును ప్రాజెక్ట్‌ ఏజెడ్‌ఎంపై ఖర్చుచేసి జెఎఫ్‌-17ను బలోపేతం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు జె-17లకు ఆర్‌డీ-93 ఇంజిన్లు, స్పేర్‌పార్టులు లభించడంలేదు. దీంతో పాక్‌లో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే గాల్లోకి లేచేందుకు సిద్ధంగా ఉన్న యుద్ధ విమానాల సంఖ్య  తగ్గిపోతోంది. నాలుగు వైమానిక స్థావరాల్లో కలిపి పాక్‌ వద్ద 100 జె-17లు ఉన్నాయి. జె-10 విమానాలను విక్రయించేందుకు చైనా పత్రికలు రఫేల్‌తో పోలుస్తూ కథనాలు వండివార్చాయి. వీటిని అడ్డంపెట్టుకొని ఇప్పుడు పాక్‌కు అంటగడుతున్నాయి. జె-17ల అనుభవం ప్రత్యక్షంగా చూసి కూడా.. మళ్లీ జె-10సిని కొనుగోలు చేసి దానిని రఫేల్‌తో పోల్చడం పాక్‌కే చెల్లింది.  అమెరికా ఎఫ్‌-16 విక్రయాలు, అప్‌గ్రేడ్లపై సవాలక్ష అంక్షలు విధించడంతో గతిలేక జె-10సిని పాక్‌ కొనుగోలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని