Delhi: కోరిక తీరిస్తే 24గంటల్లో వీసా.. ప్రొఫెసర్‌తో పాక్‌ అధికారుల అనుచిత ప్రవర్తన

పాకిస్థాన్‌ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేస్తే దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికారులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు.

Published : 13 Jan 2023 07:34 IST

పాకిస్థాన్‌ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేస్తే దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికారులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారనీ, కోరిక తీరిస్తే 24 గంటల్లోనే వీసా ఇస్తామని చెప్పారని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని అక్కడి సిబ్బంది తనను అడిగి, డబ్బు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని చెప్పారు. పాక్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇన్నాళ్లుగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఆమె లేఖ రాశారు. 2021లో పాకిస్థాన్‌లోని ఓ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లేందుకు వీసా కోసం తాను ప్రయత్నించినట్లు చెప్పారు. వీసా ఇంటర్వ్యూ కోసం దిల్లీలోని పాక్‌ దౌత్య కార్యాలయానికి వెళ్తే సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తాను బయటకు వెళ్లిపోతుండగా ఓ అధికారి వచ్చి సాయం పేరుతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు. ‘మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ మతంలో వివాహేతర సంబంధాలు ఉండవచ్చా’ అంటూ ద్వంద్వార్థాలతో ప్రశ్నించారని తెలిపారు. దీనిపై పాకిస్థాన్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశానని, పాక్‌ విదేశాంగ మంత్రికి లేఖ కూడా రాశానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని