JP Nadda: పాకిస్థాన్‌ ఒంటరైంది.. ఉగ్రవాద మూలాలను ప్రపంచం తెలుసుకుంది

ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌ ఒంటరైందని భాజపా చీఫ్‌ జేపీ నడ్డా పేర్కొన్నారు. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నాయో ప్రపంచ దేశాలు కూడా అర్థం చేసుకున్నాయని చెప్పారు.

Published : 20 Jan 2023 19:41 IST

ఘాజిపుర్‌: పాకిస్థాన్‌ ఒంటరైపోయిందని, ఉగ్రవాదం ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిందో ప్రపంచ దేశాలు కూడా అర్థం చేసుకున్నాయని భాజపా చీఫ్‌ జేపీ నడ్డా పేర్కొన్నారు. పార్టీ అధినేతగా మరోసారి ఎన్నికైన ఆయన.. మాజీ సైనిక ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మన విదేశీ విధానాన్ని ప్రశంసించిన నడ్డా.. భద్రతా దళాలకు మద్దతుగా ఉందన్నారు.

‘ప్రపంచంలో పాకిస్థాన్‌ ఒంటరైంది. ఎందుకంటే.. ఉగ్రవాదం ఎక్కడ మొదలైందనే విషయాన్ని ప్రపంచం అర్థం చేసుకుంది. అంతేకాకుండా ఉగ్రవాదంపై భారత్‌ ఎలా పోరాడిందో కూడా ప్రపంచం తెలుసుకుంది’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇక భారత ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ప్రధాని దీపావళి కూడా జవాన్లతోనే చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. దేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రధానమంత్రి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యంగా మనది పరిగణించబడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఎటువంటి సంక్షోభం వచ్చినా.. మనతోపాటు సరిహద్దులను భారత జవాన్లు రక్షిస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వాలు రక్షణశాఖను బలహీనం చేశాయని ఆరోపించిన నడ్డా.. యుద్ధవిమానాలు, ఆయుధాలతోపాటు చివరకు జవాన్లు వేసుకునే బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లలోనూ అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపైనా విమర్శలు గుప్పించారు. వన్‌ ర్యాంకు వన్‌ పెన్షన్‌ పథకానికి ఆయన రూ.500కోట్లు కేటాయించి అవమానించారని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం రూ.35వేల కోట్లు ఇచ్చిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని