విగ్రహం ఆయనదే.. కానీ ఆయన కాదు!

ప్రముఖుల సేవలకు గుర్తుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం సహజం. ప్రభుత్వాలు లేదా అభిమానులు కలిసి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాగే, పాకిస్థాన్‌కు చెందని ప్రముఖ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విగ్రహాన్ని ఇటీవల లాహోర్‌లోని గుల్షాన్‌-ఇ- ఇక్బాల్‌ పార్క్‌లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విగ్రహంపై

Published : 08 Feb 2021 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖుల సేవలకు గుర్తుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం సహజం. ప్రభుత్వాలు లేదా అభిమానులు కలిసి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాగే, పాకిస్థాన్‌ ప్రముఖ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విగ్రహాన్ని ఇటీవల లాహోర్‌లోని గుల్షాన్‌-ఇ- ఇక్బాల్‌ పార్క్‌లో ఏర్పాటు చేశారు. కానీ ఈ విగ్రహం ట్విటర్‌లో తెగ ట్రోల్‌ అవుతోంది. ఎందుకంటారా..?

ఆ పార్క్‌లో ఏర్పాటు చేసింది మహమ్మద్‌ ఇక్బాల్‌ విగ్రహమే అయినా.. విగ్రహానికి, ఆయనకు అస్సలు పోలికలు లేవు. దీంతో లైలా తారిఖ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఆ విగ్రహాలకు సంబంధించిన ఫొటోలు పోస్టు చేసి ‘‘ఇది గుల్షాన్‌-ఇ-ఇక్బాల్‌ పార్క్‌లో ఉన్న ఇక్బాల్‌ విగ్రహం. ఈ విగ్రహంలో ఎలాంటి తప్పులు లేవు. కాకపోతే ఇది ఇక్బాల్‌లా కనిపించట్లేదు’’అని ట్వీట్‌‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె ట్వీట్‌పై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇది మేడ్‌ ఇన్‌ చైనా విగ్రహమని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు గొప్ప వ్యక్తిని ఇలా అవమానించొద్దని, మంచి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.

ఇక్బాల్‌ విగ్రహం నెట్టింట్లో వైరల్‌ అవుతుండటంతో లాహోర్‌ పార్క్స్‌ అండ్‌ హర్టికల్చర్‌ అథారిటీ చైర్మన్‌ యాసిర్‌ గిలానీ స్పందించారు. ‘‘ఈ విగ్రహాన్ని పార్కులో పనిచేస్తోన్న తోటమాలీలు ఇక్బాల్‌పై ఉన్న అమితమైన ప్రేమ, గౌరవంతో వారి సొంత డబ్బుతో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కోసం ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. దీనిపై మేం చర్యలు తీసుకుంటాం. కానీ, ఎవరైనా ఆ విగ్రహాన్ని తోటమాలిల కళ్లతో చూడండి. ఇక్బాల్‌ పట్ల వారి ప్రేమ కనిపిస్తుంది’’అని ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని