Updated : 13 Jul 2021 14:18 IST

Pakistan: పాక్‌లో మలాలాపై విష ప్రచారం..!

 ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ నిర్వాకం

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌లోని విద్యార్థులకు నోబెల్‌ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌పై విషం నూరిపోస్తున్నారు. ఇదేదో ఛాందసవాదులు చేస్తున్న పనికాదు. ఆ దేశ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ నిర్వాకం. ఇందుకోసం ఆ సంఘం ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది. మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అజెండా అమలు విషయంలో ఆమె తీరును దీనిలో ప్రస్తావించారు. మలాలా సోమవారం 24వ పుట్టిన  రోజు జరుపుకొన్నారు.

సోమవారం పాకిస్థాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్‌ పాకిస్థాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.  దీని అధ్యక్షుడు కసీఫ్‌ మిర్జా మాట్లాడుతూ ‘‘ ఐ యామ్‌ నాట్‌ మలాలా  డాక్యుమెంటరీ  చిత్రంలో.. ఆమెకు మతం, పెళ్లిపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాలు, పశ్చిమ దేశాల అజెండా అమలు వంటి అంశాలను వెల్లడించాం. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కుల కోసం పోరాడుతుందనుకొని యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే మా ఉద్దేశం. మా దేశంలోని రెండు లక్షల పాఠశాలల్లోని రెండు కోట్ల  మంది విద్యార్థులకు దీనిని చూపిస్తాం’’ అని పేర్కొన్నారు. మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తూ సహజీవనాన్ని సమర్థిస్తోందని ఆరోపించారు. దేశంలోని వివాహ వ్యవస్థపై ఆమె దాడి చేస్తోందని పేర్కన్నారు. మలాలా రాసిన ‘ఐ యామ్‌ మలాలా’ పుస్తకంలోని పలు అంశాలను ఆయన తప్పుపట్టారు. పాక్‌ పాఠశాలల్లో మతపరమైన విద్యను బోధించడం, అలీ జిన్నా గురించి చెప్పడంపై ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. ఈ పుస్తకాన్ని పశ్చిమ దేశాల అజెండా అమలు కోసం రాసినట్లు ఉందన్నారు.

ఫిబ్రవరిలో బెదరింపులు..

మలాలా యూసఫ్‌జాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనకు బాధ్యుడైన ఉగ్రవాది ఇషానుల్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంతకు ముందు జరిగిన తప్పు మరోసారి జరగదంటూ మలాలాను ఉద్దేశిస్తూ హెచ్చరించాడు. ‘‘త్వరగా ఇంటికి రా.. నీతో, నీ తండ్రితో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. ఈ సారి తప్పు జరగదు’’ అంటూ ట్వీట్‌ చేశాడు. అనంతరం ఆ ఖాతాను ట్విటర్‌ తొలగించింది. తనపై కాల్పులు జరిపిన కేసులో కీలక వ్యక్తి జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడంటూ.. మలాలా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, పాకిస్థాన్‌ సైన్యాన్ని ప్రశ్నించింది.

పాకిస్థాన్‌లో బాలికల విద్యపై పోరాటం చేస్తున్న మలాలాపై 2012లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో కీలక సూత్రధారి అయిన ఉగ్రవాది ఇషానుల్లా 2017లో పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం 2020 జనవరిలో తాను జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలతో కూడా అతడు ట్విటర్‌లోనే సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇషానుల్లాకు చాలా ట్విటర్‌ ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్‌ పాకిస్థాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఆమెపై విద్యార్థుల్లో విషం నూరిపోసే డాక్యుమెంటరీని విడుదల చేయడం ఆందోళనకరంగా మారింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని