G20 meet in Srinagar: బిలావల్‌ మళ్లీ విషం కక్కాడు...

కశ్మీర్‌లో జీ20 సదస్సు నిర్వహణపై పాకిస్థాన్‌ అక్కసు వెళ్లగక్కింది. భారత్‌ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.  

Published : 22 May 2023 21:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని కశ్మీర్‌లో నిర్వహించడాన్ని పాకిస్థాన్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఈ సమావేశం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ ఆరోపించారు. ఆయన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో నిన్నటి నుంచి మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఈ సమావేశాన్ని ఉపయోగించుకొని అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించడం సాధ్యంకాదు’’ అని పేర్కొన్నారు.

మే 22-24 వరకు జీ20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం జరుగుతుంది. దీనిలో 60 మందికి పైగా వివిధ దేశాల ప్రతినిధిలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, మారిషస్‌, సింగపూర్‌ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే విదేశీ ప్రతినిధులకు సంప్రదాయ పద్ధతిలో షేర్‌ ఈ కశ్మీర్‌ ఇంటర్నెషనల్‌ కన్వెన్షనల్‌ సెంటర్‌ వద్ద స్వాగతం పలికారు. శ్రీనగర్‌ మొత్తం మూడంచల భద్రతా వలయంలో ఉంది. నగరం మొత్తాన్ని ఇప్పటికే భద్రతా దళాలు  క్షణ్ణంగా తనిఖీలు చేశాయి. సీసీటీవీలు, యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను మోహరించాయి. ఈ మూడు రోజులు విదేశీ ప్రతినిధులను కశ్మీర్‌లోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.  

ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్‌ అందడంతో గుల్‌మార్గ్‌లో జరగాల్సిన జీ20 కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇక్కడ జరిగే కార్యక్రమంపై 26/11 తరహాలో దాడి చేయాలని కుట్రపన్నినట్లు సమాచారం. 370 అధికరణం రద్దు చేసి, జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక ఇక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ కార్యక్రమమిది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధుల కోసం గతంలో ఇక్కడి నుంచి తరలించిన 30 కంపెనీల సీఆర్పీఎఫ్‌ దళాలు తిరిగి జమ్మూకశ్మీర్‌కు చేరుకొని భద్రతా విధుల్లో నిమగ్నం అయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని