Vaccine Bond: పాకిస్థాన్‌కు 15లక్షల ‘చైనా’ డోసులు!

చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ 15లక్షల డోసులను దిగుమతి చేసుకున్నట్లు పాకిస్థాన్‌ వెల్లడించింది.

Published : 21 Jun 2021 01:18 IST

మరో 10రోజుల్లో 50లక్షల డోసులు

ఇస్లామాబాద్‌: కరోనా వైరస్‌ కాలంలోనూ పాకిస్థాన్‌-చైనా దేశాల మధ్య దోస్తీ కొనసాగుతోంది. తాజాగా చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ 15లక్షల డోసులను దిగుమతి చేసుకున్నట్లు పాకిస్థాన్‌ వెల్లడించింది. దీంతో దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత ముమ్మరం కానుందని పాకిస్థాన్‌ అభిప్రాయపడింది.

చైనా తయారుచేసిన సినోవాక్‌ వ్యాక్సిన్‌ను పాకిస్థాన్‌ దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆదివారం ఒక్కరోజే 15లక్షల డోసులతో కూడిన ప్రత్యేక విమానం చైనా నుంచి ఇస్లామాబాద్‌ చేరుకుందని పాకిస్థాన్‌ నేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (NCOC) వెల్లడించింది. వచ్చే వారంలోగా చైనా నుంచి మరో 50లక్షల కరోనా డోసులు పాకిస్థాన్‌ చేరుకుంటాయని తెలిపింది.

‘దేశంలో నిత్యం దాదాపు 3లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేస్తున్నాం. కేవలం గతవారం రోజుల్లోనే 23లక్షల డోసులను పంపిణీ చేశాం. ఇప్పటివరకు పంపిణీ చేసిన వాటిలో ఇదే అత్యధికం. రానున్న రోజుల్లో వీటికంటే ఎక్కువ డోసులను అందిస్తాం. చైనా, పాకిస్థాన్‌కు సుదీర్ఘ కాలంగా ఉన్న నమ్మకమైన మిత్రదేశం’ అని పాకిస్థాన్‌ మంత్రి, NCOC చీఫ్‌ అసద్‌ ఉమర్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కాస్త తక్కువగానే ఉందని చెప్పవచ్చు. గడిచిన 24గంటల్లో అక్కడ 1050 కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 9లక్షల 48వేలకు చేరింది. నిన్న ఒక్కరోజే 37మంది ప్రాణాలు కోల్పోగా.. కొవిడ్‌ మరణాల సంఖ్య 21,977కు చేరినట్లు పాకిస్థాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. పాకిస్థాన్‌లో కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.56శాతంగా ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని