Rajnath Singh: ఎవరైనా అలా చేస్తే.. తగిన సమాధానం చెబుతాం: రాజ్‌నాథ్‌ సింగ్‌

జమ్మూ-కశ్మీర్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ నిరంతరం కుట్రలు చేస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు.......

Published : 17 Jun 2022 02:22 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ నిరంతరం కుట్రలు చేస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. అయితే.. ఎవరైనా దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేందుకు యత్నిస్తే.. తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు గాను రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి గురువారం ఆయన శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే బారాముల్లాలో జిల్లాలో భద్రతా బలగాలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

‘పొరుగు దేశం ఎప్పుడూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. గతంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగాయి. భారత్‌లో రక్తపాతం సృష్టించాలనే విధానంతో శాంతికి విఘాతం కలిగించేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు. అయితే, ఇటువంటి చర్యలకు తమ సాయుధ దళాలు దీటుగా సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. భద్రతా దళాల పనితీరును ప్రశంసిస్తూ.. వారి అవిశ్రాంత సేవల వల్లే ఇటీవల జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న సైనిక శక్తిపై దేశం అపారమైన విశ్వాసం కలిగి ఉందన్నారు. 

సరిహద్దుల వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, 15వ కోర్‌ లెఫ్టినెంట్ జనరల్ ఏఎస్‌ ఔజ్లా, జీవోసీ 19 పదాతిదళ విభాగం మేజర్ జనరల్ అజయ్ చంద్‌పురియా తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధత గురించి వారు మంత్రికి వివరించినట్లు ఓ అధికారిక ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని