India-Pakistan: భారత్‌లా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం..? పాక్‌ నేత వీడియో వైరల్‌

India-Pakistan: పొరుగు దేశం భారత్‌లా తాము ఎందుకు ఉండలేకపోతున్నామంటూ పాకిస్థాన్‌ నేత ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Published : 13 Jun 2024 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ (Indian Lok sabha Elections)లో ఇటీవల విజయవంతంగా పూర్తయిన సార్వత్రిక ఎన్నికలపై పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన ఓ నేత ప్రశంసలు కురిపించారు. సెనెట్‌లో చేసిన ప్రసంగంలో న్యూదిల్లీని ప్రస్తావిస్తూ తమ దేశ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. భారత్‌ (India)లా తాము ఎందుకు ఉండలేకపోతున్నామని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సెనెట్‌ సమావేశాల్లో ప్రతిపక్ష నేత, పాక్ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (PTI) నాయకుడు షిబిల్‌ ఫరాజ్‌ (Shibli Faraz) మాట్లాడుతూ.. భారత ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. ‘‘ఆ దేశాన్ని (భారత్‌ను ఉద్దేశిస్తూ) నేను ఉదాహరణగా చూపించాలనుకోవట్లేదు. కానీ, ఇటీవల అక్కడ ఎన్నికలు (Lok Sabha Elections) జరిగాయి. కోట్లాది మంది ప్రజలు లక్షలాది పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల కేవలం ఒక్క ఓటరు కోసం కూడా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈవీఎంల సాయంతో నెల రోజులకు పైగా ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. అందులో ఒక్కరైనా రిగ్గింగ్‌ ఆరోపణలు చేశారా? మనమెందుకు అలా ఉండలేకపోతున్నాం..! స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు మనకెందుకు వద్దు?’’ అని ఫరాజ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు.. కువైట్‌ అగ్నిప్రమాదంలో భయానక దృశ్యాలు

ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌ (Pak Elections)లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ అల్లర్లు జరగడంతో పాటు, పలుచోట్ల రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కౌంటింగ్‌కు సుదీర్ఘ సమయం పట్టింది. అత్యధిక స్థానాల్లో పీటీఐ పార్టీ గెలిచినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజార్టీ దక్కలేదు. దీంతో పీపీపీతో కలిసి షహబాజ్‌ షరీఫ్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని