Terror Attack: ముందు డ్రైవరే టార్గెట్‌.. ఉగ్ర వ్యూహం..!

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వాహనాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఉగ్ర దాడుల్లో ఒకేరకమైన వ్యూహం కనిపిస్తోంది. 

Updated : 09 Jul 2024 11:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముందుగా రెక్కీలు.. అత్యాధునిక ఆయుధాలు.. స్థానికుల సాయం.. తొలుత వారే టార్గెట్‌.. ఇలా ఒకే రకమైన శైలిలో ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో రెండు భారీ ఉగ్రదాడులు చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది. కఠువా జిల్లాలో సోమవారం జరిగిన దాడి గతంలో రియాసీలో బస్సుపై జరిగిన ఉగ్ర ఘటనకు పోలికలున్నాయి. ఈసారి కూడా ముష్కరులు పక్కా ప్లానింగ్‌తో సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకొన్నట్లు కనిపిస్తోంది. 

వాహనాలు స్లో అయ్యే చోటే మాటువేసి..

మాచేడీ- కిండ్లీ- మల్హార్‌ రోడ్డులో బడ్‌నోటా అనే గ్రామం వద్ద రోడ్డు  బాగోలేదు. ఏ వాహనమైనా ఇక్కడ గంటకు 15 కిలోమీటర్ల వేగాన్ని మించకుండా వెళ్లాల్సిందే. ఉగ్రవాదులు ముందుగా నిర్వహించిన రెక్కీ ప్రకారం దాడికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని గుర్తించి మాటువేశారు. ఇద్దరు లేదా ముగ్గురు పాక్‌ ఉగ్రవాదులకు.. ఒకరు లేదా ఇద్దరు స్థానిక గైడ్లు సాయం చేసినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంపై పక్కాగా గురిపెట్టేలా ముష్కరులను సమీపంలోని ఓ కొండపైకి తీసుకెళ్లారు. వాహనం తమ టార్గెట్‌లోకి రాగానే దాడి మొదలుపెట్టారు. 

తొలుత టార్గెట్‌ డ్రైవరే..

రోడ్డు సరిగ్గా లేనిచోట వాహనాన్ని అడ్డుకొని కాల్పులు జరపాలన్నది ఉగ్ర వ్యూహంలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వారు తొలుత గ్రనేడ్‌ విసిరారు. ఆ తర్వాత తక్షణమే డ్రైవర్‌ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అనంతరం నిలిచిపోయిన వాహనంపై విచక్షణారహితంగా రెండువైపుల నుంచి కాల్పులు జరిపారు. స్థానిక గైడ్‌ సాయంతో ఉగ్రవాదులు తమ స్థావరాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ముష్కరులు రెక్కీ నిర్వహించడానికి, వారికి ఆహారం సమకూర్చడానికి ఆ గైడ్లే సాయం చేశారు. గతంలోనూ ఉగ్ర మూకలు ఇలా వాహన చోదకుడినే తొలుత టార్గెట్‌ చేసుకొన్నాయి. 

కఠువా ప్రాంతంలోకి రెండు నెలల క్రితమే పెద్దసంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా దళాలకు ఇన్‌పుట్స్ ఉన్నాయి. జూన్‌ 11-12 తేదీల్లో ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. నెల చివర్లో కూడా కోట్‌ పన్నూ వద్ద  ఇద్దరు సాయుధులు సంచరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కఠువాకు ఒకవైపు పాక్‌తో సరిహద్దు ఉంది. 1990-2000 మధ్య ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు మాచేడీలో సైనిక స్థావరం ఏర్పాటుచేశారు. గత నెల రియాసీలో బస్సుపై దాడి సమయంలో ఉగ్రవాదులు స్థానిక గైడు సాయం తీసుకొన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఈసారీ అదేవిధంగా దాడి జరిగింది. దీనికితోడు అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌ను ఈ దాడిలో వినియోగించారు. 

భద్రతా దళాలకు సవాలుగా ‘నాటో ఆయుధం’.. 

అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌ను ఇటీవలకాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నాటో దళాలు వాడే ఎం16ఏ2కు ఇది తేలికపాటి రకం. 2.5 కేజీల బరువు ఉంటుంది. పొట్టి బ్యారెల్‌తో వేగంగా కదలడానికి అనువైంది. 2021 అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా దళాలు బిలియన్ల డాలర్లు విలువైన ఆయుధాలు వదిలి వెళ్లిపోయాయి. వీటిని పాక్‌లోని ఉగ్రసంస్థలైన లష్కరే, జైషేలు తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. అవి గత కొంతకాలంగా పాక్‌ మీదుగా కశ్మీర్‌లోకి మెల్లగా చేరుతున్నాయి. గతంలో బారాముల్లాలోని 19వ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ జీవోసీ అజేయ్‌ చాంద్‌పురియా కూడా ఓ వార్త సంస్థ వద్ద ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వజ్ర కోర్‌ బాధ్యతలు చూస్తున్నారు. గతంలో పూంఛ్‌లో సైనిక వాహనంపై జరిగిన దాడిలో కూడా ఎం4ను వినియోగించారు. రియాసీలో ప్రయాణికుల బస్సుపై కూడా ఈ రకం తుపాకీతోనే కాల్పులు జరిపారు. దీనికితోడు సాయుధ కవచాలను ఛేదించే ప్రత్యేకమైన తూటాలను కూడా ఉగ్రవాదులు వాడుతున్నారు. 

రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపం..

కఠువాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికుల మృతిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం మొత్తం అండగా నిలబడుతుందన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఆపరేషన్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని