Modi in Jammu: జమ్మూ కశ్మీర్‌ ఆ ఫలాలను అందుకోలేకపోయింది..!

దేశంలో గొప్ప పంజాయితీరాజ్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్‌ మాత్రం ఆ ఫలాలను అందుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 24 Apr 2022 15:40 IST

రసాయనాల నుంచి మాతృభూమికి విముక్తి కల్పించాలన్న ప్రధాని

శ్రీనగర్‌: దేశంలో గొప్ప పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్‌ మాత్రం ఆ ఫలాలను అందుకోలేకపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం జమ్మూలో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ.. దేశంలోనే తొలి కర్బన్‌ రహిత పంచాయితీగా ఈ గ్రామం చరిత్ర సృష్టించిందన్నారు. 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని.. రూ.20వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం ఈ విధంగా మాట్లాడారు.

‘గత రెండు, మూడేళ్లలోనే జమ్మూ కశ్మీర్‌ ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. గత ప్రభుత్వాలు ఇక్కడ కేంద్ర పథకాలను అమలు చేయలేకపోయాయి. కానీ మేము దాన్ని సాధ్యం చేశాం. గడిచిన ఆరు దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో రూ.17వేల కోట్ల ఖర్చు పెట్టగా.. కేవలం రెండేళ్లలోనే మేము రూ.38వేల కోట్లను ఖర్చుచేశాం. ఎన్నోఏళ్లుగా రిజర్వేషన్లకు దూరమైన జమ్మూ ప్రజలు ఇప్పుడు వాటికి అర్హులు. మునుపటి తరాలు చూసిన సమస్యలు నేటి జమ్మూ యువత ఎదుర్కోదు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా పంచాయితీలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయడంలో గ్రామ పంచాయితీలు కీలకంగా వ్యవహరించాలన్నారు. రసాయనాల వాడకాన్ని పూర్తిగా తగ్గించి మాతృభూమిని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాని.. గ్రామపంచాయితీ స్థాయిలోనే దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

పల్లీ గ్రామం రికార్డు..

కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘గ్రామ్‌ ఊర్జా స్వరాజ్‌’ కార్యక్రమం కింద జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లా పల్లీ గ్రామంలో నిర్మించిన 500 కిలోవాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్లాంటులో 1500 సోలార్‌ ప్యానెళ్ల ద్వారా గ్రామంలోని 340 ఇళ్లకు క్లీన్‌ ఎలక్ట్రిసిటీని అందించనున్నారు. అంతేకాకుండా గ్రామంలో రోడ్లు, విద్యుత్‌ బస్సు సదుపాయం, పంచాయితీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల భవనం మరమ్మత్తులు, ఇతర అభివృద్ధి కార్యాక్రమాలను చేపట్టారు.

ఇదిలాఉంటే, కశ్మీర్‌ పర్యటనలో భాగంగా రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ రహదారిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రూ.7,500 కోట్లతో నిర్మించనున్న దిల్లీ-అమృతసర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారి, చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటితోపాటు ‘అమృత్‌ సరోవర్‌ మిషన్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని