Pune Porsche Accident: పుణె కారు ప్రమాదం.. మైనర్‌కు బెయిల్‌ మంజూరులో లోపాలు!

పుణె కారు ప్రమాదం కేసులో మైనర్‌కు బెయిల్‌ వ్యవహారంలో అనేక విధానపరమైన లోపాలు, నిబంధనలు పాటించకపోవడం వంటివి విచారణ కమిటీ గుర్తించినట్లు ఓ అధికారి వెల్లడించారు.

Published : 16 Jun 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగుల మృతికి కారణమైన బాలుడికి (17) జువనైల్‌ జస్టిస్‌ బోర్డు (JJB).. 15 గంటల్లోనే బెయిల్‌ మంజూరుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలంటూ విధించిన బెయిల్ షరతులు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే బోర్డులోని ఇద్దరు నాన్‌జ్యుడీషియల్‌ సభ్యుల పనితీరుపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర మహిళాశిశు అభివృద్ధి (WCD) విభాగం ఏర్పాటుచేసిన కమిటీ నివేదికలో పలు విషయాలు వెలుగుచూశాయి. బెయిల్‌ వ్యవహారంలో అనేక విధానపరమైన లోపాలు, నిబంధనలు పాటించకపోవడం వంటివి కమిటీ గుర్తించినట్లు ఓ అధికారి వెల్లడించారు. (Pune Porsche Accident)

పుణె వైద్యుడి వెనుక పెద్ద నెట్‌వర్క్‌

‘‘నిందితుడికి బెయిల్‌ మంజూరు సమయంలో జేజేబీలో ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. మరుసటిరోజు మరొకరు తన సమ్మతి తెలియజేశారు. నిబంధనలు పాటించకపోవడం, దుష్ర్పవర్తన వంటివి ఈ ఇద్దరు సభ్యుల విషయంలో కమిటీ గుర్తించింది. లోపాలు స్పష్టంగా ఉన్నందునే జేజేబీ బెంచ్ మరుసటిరోజు బెయిల్‌ను రద్దు చేసినట్లు విచారణలో తేలింది’’ అని అధికారి తెలిపారు. సభ్యులిద్దరి వాంగ్మూలాలనూ కమిటీ నమోదు చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశామని, నాలుగైదు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించామని డబ్ల్యూసీడీ కమిషనర్ తెలిపారు. జేజేబీలో ఒక జ్యుడీషియల్‌, ఇద్దరు నాన్‌జ్యుడీషియల్‌ సభ్యులు ఉంటారు. నాన్‌జ్యుడీషియల్‌ సభ్యులను రాష్ట్ర మహిళాశిశు అభివృద్ధి విభాగం నియమిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని