Ratna Bhandar: రత్నభాండాగారాన్ని ఆ రోజు తెరవండి..! కమిటీ నిర్ణయం

పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్నభాండాగారాన్ని ఈ నెల 14న తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు ఉన్నస్థాయి కమిటీ తెలిపింది.

Updated : 09 Jul 2024 22:06 IST

భువనేశ్వర్: ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని (Ratna Bhandar) తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం సమావేశమై చర్చలు జరిపిన కమిటీ సభ్యులు ఈ నిర్ణయంతో ముందుకొచ్చారు. రత్న భాండాగారాన్ని చివరిసారి 1978లో తెరిచారు.

 తాళం చెవి అప్పగించాలి.

‘‘రత్న భాండాగారం రహస్య గదిని జులై 14న తిరిగి తెరిపించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ తేదీలోపు తాళం చెవి అప్పగించాల్సిందిగా శ్రీక్షేత్ర పాలనాధికారికి సూచించాం. వాస్తవానికి.. నేటి సమావేశంలోనే సమర్పించాలని కోరాం. అయితే.. ఆలయ యంత్రాంగం రథయాత్రలో నిమగ్నమై ఉన్నందున సాధ్యపడలేదు. డూప్లికేట్ తాళం చెవితో తెరచుకోని పక్షంలో తాళం పగలగొట్టాలని నిర్ణయించాం’’ అని జస్టిస్‌ రథ్‌ తెలిపారు. తమ నిర్ణయాలను ఆలయ నిర్వహణ కమిటీకి పంపిస్తామని, ఆపై ప్రభుత్వ ఆమోదానికి వెళ్తుందని, ఆ తర్వాత ‘రత్న భండార్‌’ను తెరవొచ్చన్నారు.

ఆ రత్న భాండాగారంలో ఏమున్నాయ్..? ఎందుకు తెరవడం లేదు?

సంపద జాబితా రూపకల్పన, భాండాగారం మరమ్మతుల విషయంలో అవసరమైన మార్గదర్శకాలపైనా చర్చించినట్లు చెప్పారు. ‘‘మరమ్మతుల సమయంలో జగన్నాథుని ఆభరణాలు, ఇతర విలువైన సామగ్రిని ఆలయ ప్రాంగణంలోని వేరేచోటికి తరలించేలా కమిటీలో ఏకాభిప్రాయం కుదిరింది. సంపద లెక్కింపు ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ సాయం అందించాల్సిన అవసరం ఉంది. ఆభరణాల బరువు, ఇతర వివరాలను పరిశీలిస్తాం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపుతాం’’ అని జస్టిస్‌ రథ్‌ తెలిపారు.

అనేక బంగారు, వజ్రాభరణాలు..!

పూరీ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఇందులో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా. అటువంటి ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్‌ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని