Mizoram: మయన్మార్‌లో వైమానిక దాడులు.. భయం భయంగా మిజోరం వాసులు..!

మయన్మార్‌(Myanmar) సరిహద్దు ప్రాంతంలో ఉన్న మిజోరం వాసులు భయంతో వణికిపోతున్నారు. ఆ దేశంలో జరిగిన వైమానిక దాడులే అందుకే కారణం. 

Published : 12 Jan 2023 20:35 IST

ఐజ్వాల్‌: మిజోరం(Mizoram) రాష్ట్రంలోని చంఫాయి జిల్లా వాసులు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. మయన్మార్(Myanmar) దేశ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంత ప్రజలు బాంబుల మోతతో వణికిపోయారు. ఆ జిల్లాకు సమీపంలోని తిరుగుబాటు శిబిరంపై మయన్మార్ సైన్యం బాంబు దాడులు చేసింది. ఆ శబ్దాలతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారని వార్తా సంస్థ కథనాలు వెల్లడించాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ మోత మొదలయ్యిందని తెలిపాయి. 

రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా తిఔ(Tiau)నదిని పేర్కొంటారు. భారత్‌వైపు ఆ నదికి దగ్గర్లో ఉన్న గ్రామస్థులు పనిచేసుకుంటున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. దాంతో వారంతా ఇళ్లను వదిలిపారిపోయారు. అప్పుడే అస్సాం రైఫిల్‌కు చెందిన బలగాలు పరిశీలనకు వచ్చాయని స్థానికులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్‌ వైపు నది ఒడ్డుకు 30 మీటర్లు దూరంలో మందుగుండు శకలం(Shell)పడిందని మరికొందరు తెలిపారు. వైమానిక దాడుల వల్ల కనీసం రెండు బాంబులు భారత భూభాగంలో పడ్డాయని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ‘తిఔ నదికి దగ్గర్లో ఉంచిన ట్రక్కుపై బాంబు పడటంతో అది దెబ్బతింది. వైమానిక దాడుల వల్ల మయన్మార్ వాసులు కొందరు సరిహద్దు దాటి భారత్‌కు వచ్చారు. మా గ్రామస్థులు వారికి సహాయం అందించారు. ఈ దాడి సమయంలో మూడు ఫైటర్ జెట్స్‌, రెండు హెలికాప్టర్లు కనిపించాయి’ అని ఫర్కాన్‌ గ్రామపెద్ద వెల్లడించారు. 

మయన్మార్‌ పశ్చిమ ప్రాంతంలోని చిన్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు దళం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలో పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని పీపుల్స్‌ డిఫెన్స్ ఫోర్స్(PDF)పేరిట పోరాడుతోంది. వీరి శిక్షణా కేంద్రం మిజోరంకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. 

ఎన్నికల్లో అక్రమంగా గెలిచారంటూ 2021 ఫిబ్రవరిలోఆంగ్‌ శాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. తమ అధికారాన్ని పటిష్ఠం చేసుకునేందుకు సైనిక ప్రభుత్వం(జుంటా) వైమానిక దాడులను ఒక వ్యూహంగా మార్చుకుంది. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు సైతం బలవుతున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని