Pankaja Munde: కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే

భాజపా నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే కంటతడి పెట్టుకున్నారు. 

Updated : 17 Jun 2024 21:36 IST

బీద్‌: భాజపా నేత, మాజీ మంత్రి పంకజ ముండే కంటతడి పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీద్‌లో ఓటమి పాలయ్యారు. ఆమె పరాజయాన్ని జీర్ణించుకోలేని నలుగురు కార్యకర్తలు ఆత్మహత్యకు పాల్పడగా వారి కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులను చూసి తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.  పొపట్ వైభాసే అనే కార్యకర్త ఇంటికి వెళ్లిన పంకజ ముండే.. కుటుంబ సభ్యులు, పిల్లలతో మాట్లాడి ఓదార్చిన ఫొటోలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులకు కీలక విజ్ఞప్తి చేశారు. 

పొపట్ వైభాసే ప్రతి పనిలోనూ చురుగ్గా పనిచేసే వారని, ఆయనొక పోరాటవీరుడు అన్నారు. తన కుటుంబ సభ్యులను వదిలి ఇలా తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం తనను ఎంతగానో కలిచివేస్తోందని పేర్కొన్నారు. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందని.. ఆ అమాయక చిన్నారులు, కుటుంబం బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. పిల్లల్ని చూస్తుంటే బాధ వేస్తోందన్నారు.  ఓటమికి కుంగిపోయేంత బలహీనంగా ఉండకూడదన్నారు.  ఎవరూ ప్రాణాలు వదులుకోవద్దని విజ్ఞప్తి చేశారు.  ధైర్యంగా పోరాడే నాయకుడిగా ఎదగాలంటే.. కార్యకర్తలు సైతం ధైర్యంగా ఉండాలన్నారు. ఓటమికి  నిరుత్సాహ పడనని..ఇలా కొందరు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేస్తోందన్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నుంచి పోటీ చేసిన పంకజముండే ఎన్సీపీ (ఎస్‌పీ) అభ్యర్థి భజరంగ్‌సోనావానే చేతిలో ఓటమిపాలయ్యారు. మొత్తం 48 సీట్లకు గాను కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ) సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ  30 సీట్లు గెలుచుకోగా.. భాజపా 9స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని