Kerala: రెండు గంటలపాటు గాల్లో వేలాడుతూ.. పీడకల మిగిల్చిన పారాగ్లైడింగ్‌!

పారాగ్లైడింగ్‌కు వెళ్లిన ఇద్దరు.. ఓ హైమాస్ట్‌ స్తంభానికి చిక్కుకుపోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. రెండు గంటలపాటు వారు గాల్లోనే వేలాడుతూ భయంతో గడిపారు.

Published : 08 Mar 2023 01:27 IST

తిరువనంతపురం: ఓ సాహస క్రీడ ఇద్దరికి భయానక అనుభవాన్ని మిగిల్చింది. పారాగ్లైడింగ్‌ (Paragliding)కు వెళ్లిన ఓ పర్యాటకురాలితో పాటు దాని శిక్షకుడు.. బలమైన గాలులకు దారితప్పి ఎత్తయిన హైమాస్ట్‌ స్తంభానికి చిక్కుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. కేరళ(Kerala)లోని వర్కళ బీచ్‌(Varkala Beach)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే మంగళవారం ఓ పారాగ్లైడర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, పర్యాటకురాలు కలిసి స్థానిక హెలిప్యాడ్‌ నుంచి పారాగ్లైడింగ్‌కు బయల్దేరారు. ఈ క్రమంలోనే గాలి దిశలో అకస్మాత్తుగా మార్పు రావడంతో.. ఆ గ్లైడర్‌ కాస్త దారిమళ్లి అక్కడున్న ఓ ఎత్తయిన హైమాస్ట్‌ ద్వీప స్తంభానికి చిక్కుకుపోయింది.

దీంతో వారిద్దరూ.. 50 అడుగులకుపైగా ఎత్తున్న ఆ స్తంభంపై ప్రమాదకర స్థితిలో చిక్కుకుపోయారు. గ్లైడర్‌ తీగల ఆధారంతో అలాగే వేలాడుతూ ఉండిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే, వారి వద్ద పొడవైన నిచ్చెన లేకపోవడంతో.. దాదాపు రెండు గంటలపాటు వారు అలాగే వేలాడారు. ముందు జాగ్రత్త చర్యగా స్తంభం దిగువన పరుపులు, వలలు కట్టి ఉంచిన సిబ్బంది.. ఎట్టకేలకు ఆ 28 ఏళ్ల పర్యాటకురాలితోపాటు ఇన్‌స్ట్రక్టర్‌ను కాపాడారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని