Vaccination: తల్లిదండ్రులకు టీకాతో పిల్లలకూరక్షణ..!

తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల.. వారి కుటుంబంలో వ్యాక్సిన్‌ తీసుకోని చిన్నారులకు గణనీయమైన రక్షణ కలుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 29 Jan 2022 01:59 IST

జెరూసలేం: వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న కొత్త వేరియంట్ల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ప్రమాదం తక్కువే ఉంటున్నప్పటికీ పిల్లలకు వైరస్‌ సోకే ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల.. వారి కుటుంబంలో వ్యాక్సిన్‌ తీసుకోని చిన్నారులకు గణనీయమైన రక్షణ కలుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా బూస్టర్‌ డోసు తీసుకున్న తల్లిదండ్రుల నుంచి ఈ రక్షణ మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపింది.

కొవిడ్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ చిన్నారుల వ్యాక్సిన్‌ మాత్రం ఇంకా విస్తృత వినియోగంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకోని చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచి ఏ మేరకు రక్షణ కలుగుతుందో తెలుసుకునేందుకు అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ, ఇజ్రాయెల్‌లోని క్లాలిట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు టెల్‌అవివ్‌ యూనివర్సిటీ నిపుణులు అధ్యయనం చేపట్టారు. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ విజృంభణ ఎక్కువగా ఉన్న జూన్‌-అక్టోబర్‌ 2021 మధ్యకాలంలో అక్కడ ఈ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 76వేల కుటుంబాల నుంచి లక్షా 81 వేల చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వాటిని మూడు, నాలుగో డోసు తీసుకున్న తల్లిదండ్రుల సమాచారంతో పోల్చి చూశారు. వారిలో బూస్టర్‌ డోసు తీసుకున్న తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ముప్పు 20 శాతం తగ్గగా.. రెండో బూస్టర్‌ తీసుకున్న వారి నుంచి 58 శాతం ముప్పు తప్పుతున్నట్లు విశ్లేషణలో గుర్తించారు.

ఇలాంటి అధ్యయనం డిసెంబర్‌ 2020- మార్చి 2021 మధ్యకాలంలోనూ 4 లక్షల మంది చిన్నారులపై జరిపారు. ఇలా జరిపిన రెండు అధ్యయనాల్లోనూ వ్యాక్సిన్‌ తీసుకున్న పెద్ద వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పటికీ వారికి ప్రత్యక్షంగా రక్షణ కల్పించడంతోపాటు.. వారి కుటుంబంలోని పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం మాత్రం తక్కువేనని గుర్తించారు. ముఖ్యంగా బూస్టర్‌ డోసులు తీసుకున్న వారి నుంచి ఈ రక్షణ మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం నివేదిక ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని