Pariksha Pe Charcha: ‘పరీక్షా పే చర్చా’.. విద్యార్థులకు మోదీ సలహాలివే..

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ కలలను, కోరికలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని, పిల్లల ఆసక్తులేంటో అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

Published : 01 Apr 2022 19:27 IST

దిల్లీ: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ కలలను, కోరికలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని, పిల్లల ఆసక్తులేంటో అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. పరీక్షలపై విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ప్రధాని మోదీ నేడు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేసి వారిలో మనోధైర్యం నింపారు.

విద్యార్థులు, తల్లిదండ్రులకు మోదీ ఇచ్చిన సూచనలివే..

* పరీక్షల సమయంలో పండగలను ఎంజాయ్‌ చేయలేం. కానీ, పరీక్షలను పండగలా భావిస్తే ఆనందంగా రాయగలం.

* ఎందుకు భయపడుతున్నారు?.. సముద్రమంతా ఈదుకుంటూ వచ్చిన మీరు చివరి క్షణంలో ఒడ్డున మునిగిపోతామని ఎందుకు భయపడుతున్నారు? మీరు పరీక్ష రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మీరు ఎన్నో పరీక్షలను విజయవంతంగా పాసయ్యారు. ఒత్తిడికి గురికావొద్దు.

* అతి భయం, అతి నమ్మకం వద్దు.. అది మనల్ని మరింత కంగారుకు గురిచేస్తుంది.

* ఆన్‌లైన్‌లో జ్ఞానం సంపాదించి.. ఆఫ్‌లైన్‌లో దాన్ని ఆచరణలో పెట్టండి.

* మీతో మీరు సమయం గడపండి. ఈ సమయంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కంటే కూడా ఇన్నర్‌లైన్‌లో ఉండటం చాలా అవసరం.

* టెక్నాలజీ మనకు శాపం కాదు. దాన్ని మనం సమర్థంగా ఉపయోగించుకోవాలి. నైపుణ్యాలు పెంచుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం.

పిల్లలు చాలా ప్రత్యేకం. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ప్రత్యేక టాలెంట్‌ ఉంటుంది. దాన్ని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలి. అంతేగానీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ కలల్ని వారిపై బలవంతంగా రుద్దొద్దు.

* పోటీని చూసి ఎప్పుడూ భయపడొద్దు. పోటీ ఎక్కువగా ఉందంటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లే. అందువల్ల ఫలితాల కోసం చూడకుండా పోటీల్లో పాల్గొంటూ ఉండాలి.

* మనలో స్ఫూర్తి నింపేందుకు ఎలాంటి ఇంజెక్షన్‌ ఉండదు. మనలోని ఆత్మన్యూనతను దూరం చేసుకుని ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందుతూ ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని