ఎంపీలంతా కరోనా టెస్ట్‌ చేయించుకోవాల్సిందే: స్పీకర్‌

జనవరి 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. అయితే కొవిడ్‌ దృష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు.

Published : 19 Jan 2021 19:00 IST

ఇకపై పార్లమెంట్‌ క్యాంటీన్లలో భోజనం మరింత ప్రియం

దిల్లీ: జనవరి 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కొవిడ్‌ దృష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశమవుతాయని వెల్లడించారు. 

సెప్టెంబరులో జరిగిన విధంగానే లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లలో సమావేశాలు కొనసాగుతాయని ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం మాత్రం సెంట్రల్‌ హాల్‌లో ఉంటుందని చెప్పారు. ఇక సమావేశానికి వచ్చే ఎంపీలంతా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంపీల పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 27,28 తేదీల్లో పార్లమెంట్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

క్యాంటీన్‌ భోజనంపై సబ్సీడీ రద్దు

పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న అన్ని క్యాంటీన్లలో భోజనం ఇకపై మరింత ప్రియం కానుంది. ఈ భోజనంపై అందించే రాయితీని ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అయితే దీనివల్ల ప్రభుత్వానికి మిగిలే ఆదాయ లెక్కల గురించి బిర్లా చెప్పనప్పటికీ.. రాయితీ తొలగింపుతో ఏటా రూ. 8కోట్లకు పైగా ఆదా అవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. కాగా.. ఇప్పటివరకు పార్లమెంట్‌ క్యాంటీన్లను ఉత్తర రైల్వే నిర్వహించగా.. ఇకపై ఐటీడీసీ నడుపుతుందని స్పీకర్‌ చెప్పారు.

ఇవీ చదవండి..

ఈ బడ్జెట్‌ భిన్నం.. ఎందుకంటే

ఈసారికి ‘లోటు’పాట్లను పట్టించుకోకుండా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని