Rahul Gandhi: ఇటుకలతో కట్టిన నిర్మాణం కాదు.. ప్రజాస్వామ్య దేవాలయం: రాహుల్‌ ధ్వజం

New Parliament Building Opening: రాష్ట్రపతి (President) చేతుల మీదుగా పార్లమెంట్‌ ప్రారంభోత్సవం నిర్వహించకపోవడం రాజ్యాంగ అధినేతను అవమానించడమేనని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధ్వజమెత్తారు.

Updated : 24 May 2023 17:56 IST

దిల్లీ: పార్లమెంటు (Parliament) నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి (Prime Minister) ప్రారంభించనుండడంపై మొదలైన రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. దీన్ని తీవ్రంగా ఖండించిన 19 విపక్షాలు.. ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈ వివాదంపై స్పందిస్తూ.. మోదీ (Modi) సర్కారుపై విమర్శలు గుప్పించారు. దేశ ప్రథమ పౌరురాలిని కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని దుయ్యబట్టారు. (New Parliament Building Opening)

‘‘రాష్ట్రపతి (President) చేతుల మీదుగా పార్లమెంట్‌ ప్రారంభోత్సవం నిర్వహించకపోవడం, ఈ వేడుకలకు ఆమెను ఆహ్వానించకపోవడం.. రాజ్యాంగ అధినేతను అవమానించడమే. పార్లమెంట్‌ అంటే.. అహంకారపు ఇటుకలతో కట్టిన నిర్మాణం కాదు.. రాజ్యాంగ విలువలతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం’’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

మే 28వ తేదీన నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు.. ఈ వేడుకను బహిష్కరిస్తూ బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రాష్ట్రపతి అంటే కేవలం దేశాధినేత మాత్రమే కాదని.. పార్లమెంట్‌లోనూ అంతర్భాగమే అని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ తీరు ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే గాక.. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని ఆరోపించాయి. మరోవైపు, విపక్షాల నిర్ణయాన్ని భాజపా మంత్రులు, నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు కావాలనే కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని