Parliament: ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు‌.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా

అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ (Parliamnet)లో సోమవారం కూడా వాయిదాల పర్వం నడిచింది. దీనిపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయి.

Published : 06 Feb 2023 15:14 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదిక, అదానీ (Adani Group) కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా మూడో రోజు పార్లమెంట్‌ (Parliament) స్తంభించింది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే మరో రోజుకు వాయిదా పడింది.

సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాలు ఇవ్వగా.. ఉభయ సభల సభాధ్యక్షులు తిరస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిపేందుకు విపక్షాలు సహకరించాలని సభాపతులు సూచించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనలతో ఎటువంటి చర్చ లేకుండానే లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ  (Rajya Sabha) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఉభయ సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. దీంతో వరుసగా మూడో రోజూ పార్లమెంట్‌లో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు.

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. 2వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరపాల్సి ఉంది. అయితే, అదానీ షేర్ల పతనం అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్‌ చేయడంతో గత మూడు రోజులుగా ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ గతవారం అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) ఇచ్చిన నివేదిక మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ JPC) లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు(Opposition Parties) డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని