twitter.. వారి ఖాతాలను ఎందుకు ఆపారో చెప్పండి!

దేశంలో ట్విటర్‌ వ్యవహార శైలిని పార్లమెంటరీ ప్యానెల్‌ మరోసారి తప్పుబట్టింది. ఇటీవల కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌,  కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఖాతాలను నిలుపుదల చేయడంపై.......

Updated : 29 Jun 2021 21:37 IST

సామాజిక మాధ్యమ సంస్థకు పార్లమెంటరీ ప్యానెల్‌ లేఖ

దిల్లీ: దేశంలో ట్విటర్‌ వ్యవహార శైలిని పార్లమెంటరీ ప్యానెల్‌ మరోసారి తప్పుబట్టింది. ఇటీవల కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌,  కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఖాతాలను నిలుపుదల చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వారి ఖాతాలను ఎందుకు నిలుపుదల చేశారో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని శశిథరూర్‌ నేతృత్వంలోని సమాచార, సాంకేతిక పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ మంగళవారం ట్విటర్‌కు లేఖ రాసినట్టు సమాచారం. లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని సూచించింది.

ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఖాతాను ట్విటర్‌ దాదాపు గంట పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. అమెరికా డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టం నిబంధనను ఉల్లంఘించారని పేర్కొంటూ తన ఖాతాను నిలిపివేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది భారత దేశ ఐటీ చట్టాలకు విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా తనకూ అలాంటి పరిస్థితే ఎదురైనట్టు వెల్లడించారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఈ వ్యవహారంపై ట్విటర్‌ నుంచి వివరణ కోరనున్నట్టు థరూర్‌ గతంలో పేర్కొన్నారు.

ట్విటర్‌పై మరో కేసు నమోదు

ట్విటర్‌పై మరో కేసు నమోదైంది. చిన్నారుల అశ్లీలతకు సంబంధించిన సమాచారం ఉంటోందంటూ జాతీయ బాలల హక్కుల కమిషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు పోస్కో, ఐటీ చట్టాల కింద  కేసు నమోదు చేశారు. ‘మధ్యవర్తి’ హోదాను కోల్పోయిన తర్వాత ట్విటర్‌పై కేసు నమోదు కావడం ఇది నాలుగోసారి. మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవడంతో వినియోగదారుల అభ్యంతరకర పోస్టులకు ట్విటర్‌ కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని