Parliament: ముందుగానే.. ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు

13 రోజులపాటు కొనసాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter session) శుక్రవారంతో ముగిశాయి. విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభ(Lok Sabha)లో 13 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. అటు రాజ్యసభలోనూ అధికార, విపక్షాల వాగ్వాదం నడుమ పలు బిల్లులకు ఆమోదం లభించింది.

Published : 23 Dec 2022 16:28 IST

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter session) నేటితో ముగిశాయి. షెడ్యూల్‌కు ఆరు రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈసారి మొత్తం 13 రోజులపాటు సభ కొనసాగగా.. 97 శాతం మెరుగైన పనితీరు సాధించినట్లు లోక్‌సభ (Lok Sabha) స్పీకర్‌ ఓం బిర్లా తన ముగింపు ప్రసంగంలో వెల్లడించారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. ఈ దఫా సమావేశాల్లో ప్రధానంగా చైనా సరిహద్దు అంశంపై చర్చించాలని విపక్ష పార్టీలు పట్టుబడిన సంగతి తెలిసిందే.

డిసెంబర్‌ 7న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలను (Parliament Winter session) డిసెంబర్‌ 29వరకు కొనసాగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, పండగలు, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని సమావేశాలను త్వరగా ముగించాలని సభ్యుల నుంచి ప్రభుత్వానికి, ఉభయ సభల ప్రిసైడింగ్‌ అధికారులకు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆరు రోజుల ముందు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి.

శీతాకాల సమావేశాలు మొదలైన రెండు రోజులకే అరుణాచల్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో (Tawang clash) భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం బయటకు వచ్చింది. ఈ అంశంపై చర్చ జరపాలని విపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీనిపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్‌స్తే ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని తెలిపారు.

శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ 102 శాతం పనితీరు కనబర్చిందని ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ వెల్లడించారు. 13 రోజులపాటు కొనసాగిన ఈ సమావేశాల్లో 64 గంటల 50ని.లు సభ సాగిందన్నారు. సభలో విపక్ష సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. వారి తీరు వల్ల ఒక గంట 45ని.ల విలువైన సమయం వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని