Partha Chatterjee: పార్థా ఛటర్జీ, అర్పితాకు 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

పాఠశాల ఉద్యోగాల నియామకం కుంభకోణంలో అరెస్టయి తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి కోర్టు 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.........

Published : 05 Aug 2022 21:24 IST

కోల్‌కతా: పాఠశాల ఉద్యోగాల నియామక కుంభకోణంలో అరెస్టయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee), ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి (Arpita Mukherjee) కోర్టు 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. జులై 23న అరెస్టయిన ఆ ఇరువురిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాది కోరగా.. కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు వారికి 14రోజుల కస్టడీ విధించింది. ఆగస్టు 18న తదుపరి విచారణ ఉండనున్నట్లు తెలిపింది.

2014-2021 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా బెంగాల్‌ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఛటర్జీ ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు..  ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, వ్యక్తిగత కార్యదర్శిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అర్పిత నివాసాల్లో ఈడీ సోదాలు జరపగా.. దాదాపు రూ.50కోట్ల విలువైన కరెన్సీ, భారీగా బంగారం, కీలక దస్త్రాలను సీజ్‌ చేశారు.

అయితే.. దొరికిన డబ్బు, బంగారంతో తమకెలాంటి సంబంధం లేదని ఛటర్జీతోపాటు అర్పిత చెబుతున్నారు. ఆమె ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదని, తనపై జరుగుతున్న కుట్రకు తానొక బాధితుడినని పార్థా ఛటర్జీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అనుమతి లేకుండానే తన ఇళ్లలో ఆ డబ్బు, నగలు పెట్టారని ఈడీ విచారణలో అర్పిత చెప్పినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని