Mamata Banerjee: మంత్రి అరెస్టు వేళ.. దీదీకి మూడు సార్లు ఫోన్‌..!

ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గంలోని మంత్రి పార్థా ఛటర్జీ అరెస్టయ్యారు.

Updated : 25 Jul 2022 12:02 IST

మమత నుంచి సమాధానం రాలేదట

కోల్‌కతా: ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గంలోని పార్థా ఛటర్జీ అరెస్టయ్యారు. అయితే, ఆయన అరెస్టయిన తర్వాత మూడుసార్లు మమతకు ఫోన్‌చేసినా తీయలేదట. తనను కస్టడీలోకి తీసుకున్న విషయాన్ని తెలియజేసేందుకు మమతకు ఫోన్‌ చేసినట్లు అరెస్ట్ మెమోను బట్టి తెలుస్తోంది. తనను రక్షించే వ్యక్తి ఆమెనే అని ఛటర్జీ భావించినప్పటికీ.. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఆయనకు దూరం జరిగినట్లు కనిపిస్తోంది.

‘శనివారం అర్ధరాత్రి 1.55 గంటల సమయంలో అరెస్టయిన తర్వాత తెల్లవారుజామున 2.33 గంటలకు ఛటర్జీ నుంచి మమతా బెనర్జీకి ఫోన్ వెళ్లింది. అయితే అటువైపు నుంచి సమాధానం రాలేదు. మళ్లీ 3.37 గంటలకు, ఉదయం 9.35 గంటలకు మరోసారి ఫోన్‌ చేసినా.. ఉపయోగం లేకపోయింది’ అని ఆ అధికారిక దస్త్రాలు పేర్కొన్నాయి. తమ అరెస్టు గురించి నిందితులు బంధువులు లేక స్నేహితులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దానిలో భాగంగానే ఈ ఫోన్‌కాల్స్‌ వెళ్లాయని తెలిపాయి. అయితే, ఈ వార్తలను తృణమూల్‌ కాంగ్రెస్ తోసిపుచ్చింది. అరెస్టయిన మంత్రి ఫోన్‌ ఈడీ అధికారుల వద్ద ఉన్నందున ఆయన ఫోన్‌ చేసే అవకాశమే లేదంటూ ఖండించింది.   

ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో శనివారం బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన మమతకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కావడం గమనార్హం. ఇక ఆయనతో పాటు ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంత ఆచార్య కూడా అరెస్టయ్యారు. ఈ వరుస అరెస్టులు బెంగాల్‌ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

పార్థా ఛటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన 2014-2021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి శుక్రవారం జరిపిన సోదాల్లో అర్పితా ముఖర్జీ నివాసంలో లభించిన నగదు రూ.21 కోట్లుగా ఈడీ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి 26 గంటల పాటు ఛటర్జీని ఆయన నివాసంలో ప్రశ్నించిన అధికారులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేదని తెలపడంతో ప్రస్తుతం ఆయన్ను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని