Patna High Court: 50 శాతానికి మించిన రిజర్వేషన్లు చెల్లవు

జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బిహార్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని  పట్నా హైకోర్టు రద్దుచేసింది.

Published : 21 Jun 2024 06:18 IST

బిహార్‌లో 65 శాతానికి కోటా పెంపు రద్దు
పట్నా హైకోర్టు సంచలన తీర్పు

పట్నా: జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బిహార్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని  పట్నా హైకోర్టు రద్దుచేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్, జస్టిస్‌ హరీశ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ప్రభుత్వం ఆ నివేదికను గతేడాది నవంబరులో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చింది. దీనిని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు(ఓబీసీ), అణగారిన వర్గాల(ఈబీసీ) రిజర్వేషన్లు 65 శాతానికి పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఎస్సీలకు 16 నుంచి 20 శాతానికి, ఎస్టీలకు ఒక శాతం నుంచి రెండు శాతానికి, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30శాతంగా ఉన్న రిజర్వేషన్లు 43 శాతానికి చేరాయి. అయితే, ఈ పెంపును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. 65 శాతానికి పెంచిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది. రాజ్యాంగ అధికరణలు 14, 16, 20 ప్రకారం బిహార్‌ ప్రభుత్వ నిర్ణయం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగం విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని అధిగమించేలా కోటాను నిర్ణయించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను బిహార్‌ ప్రభుత్వ నిర్ణయం ఉల్లంఘిస్తోందని 87 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. లోతైన అధ్యయనం, సరైన విశ్లేషణ లేకుండానే రిజర్వేషన్లను పెంచారని ధర్మాసనం ఆక్షేపించింది.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ విస్మయం

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేయడంపై విపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ విస్మయం వ్యక్తం చేశారు. నీతీశ్‌ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయకపోతే తామే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నీతీశ్‌ మౌనం వహించడం తగదన్నారు. ‘రాష్ట్రం కోసం.. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో రాష్ట్రాల రిజర్వేషన్లను చేర్చాలని కోరుతూ ప్రధానికి విజ్ఞప్తి చేయాలని కోరుతున్నా’నని విలేకరుల సమావేశంలో తేజస్వీ యాదవ్‌ అన్నారు. అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించాలని కోరుతూ నీతీశ్‌కు లేఖ రాస్తానని, తద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రధానితో చర్చించడానికి వీలవుతుందని తెలిపారు. పెంచిన రిజర్వేషన్లను కొనసాగించేందుకు నీతీశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. దీనిపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరేమిటంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని