Bihar Reservations: 65% రిజర్వేషన్లు రద్దు.. పట్నా హైకోర్టు సంచలన తీర్పు

Bihar Reservations: బిహార్‌లో 65శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తూ పట్నా హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

Updated : 20 Jun 2024 16:15 IST

పట్నా: బిహార్‌ (Bihar)లో నీతీశ్ కుమార్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల (Reservations)ను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు (Patna High Court) కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

బిహార్‌ వ్యాప్తంగా కులగణన చేపట్టి ఆ నివేదికను నీతీశ్ సర్కారు గతేడాది నవంబరులో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్ల (Reservations)ను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి.

అవును.. పరీక్షకు ముందురోజు రాత్రే నీట్ పేపర్‌ అందింది: అంగీకరించిన విద్యార్థులు

ఇక, ఆర్థికంగా వెనకబడినవారిని ఉద్దేశించిన 10శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. ఈ పెంపు (Quota Hike)తో ఎస్సీలకు 16 నుంచి 20 శాతం, ఎస్టీలకు ఒక శాతం నుంచి రెండు శాతం, ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30శాతం ఉన్న రిజర్వేషన్‌ 43 శాతానికి పెరిగింది. అయితే, ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.

ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు