Odisha Train Accident: 382 మందికి కొనసాగుతోన్న చికిత్స.. చెన్నై చేరుకున్న ప్రత్యేక రైలు!

ఒడిశా రైలు ప్రమాద తాజా పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. మొత్తం 1,175 మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చేరగా.. 793 మంది ఇప్పటికే డిశ్ఛార్జి అయినట్లు తెలిపారు. మరోవైపు ఒడిశా నుంచి బయల్దేరిన ప్రత్యేక రైలు చెన్నైకి చేరుకుంది.

Published : 04 Jun 2023 13:52 IST

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాద ఘటన (Odisha Train Accident)లో ఇప్పటికే సహాయక చర్యలు ముగిశాయి. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు క్షతగాత్రులకు ఆయా ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన తాజా పరిస్థితుల (Train Accident Latest  Situation)ను వివరించారు. ముఖ్యంగా గాయపడిన ప్రయాణికులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

‘ప్రమాద అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 1,175 మంది క్షతగాత్రులు చేశారు. వారిలో 793 మంది ఇప్పటికే డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం 382 మంది ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు. గాయపడినవారిలో చాలామంది పరిస్థితి నిలకడగా ఉంది’ అని సీఎం పట్నాయక్‌ తెలిపారు. ‘ప్రతి ప్రాణం విలువైనదే’ అన్న విధానంతో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంక్షోభ సమయంలో ఒడిశా ప్రజలు, ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసిస్తూ సీఎం పట్నాయక్‌కు ప్రధాని మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

అవసరమైతే ఎలాంటి సాయమైనా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధానిని ఉటంకిస్తూ ఒడిశా సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. బాలేశ్వర్‌ జిల్లాలోని రైలు ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ, సీఎం నవీన్‌ పట్నాయక్‌లు శనివారం సందర్శించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 294 మంది దుర్మరణం చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

చెన్నైకి చేరుకున్న 137 మంది..

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో క్షేమంగా బయటపడిన 294 మంది ప్రయాణికులతో బయల్దేరిన ప్రత్యేక రైలు ఆదివారం చెన్నైకి చేరుకుంది. భద్రక్‌ నుంచి బయల్దేరిన ఈ రైలులో పలువురు ప్రయాణికులు ఆయా స్టేషన్లలో దిగిపోగా.. 137 మంది చెన్నైకి చేరుకున్నారు. వీరిలో 36 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురిని స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన వారిని ఇంటికి పంపించారు. అంతకుముందు రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్, రాష్ట్ర ఉన్నతాధికారులు వారిని పరామర్శించారు. ప్రయాణికుల కోసం 30 వైద్య బృందాలు, ఏడు బస్సులు, 50 ట్యాక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని