Supreme Court: ‘నా పిల్లలు ధనికులే.. నేను పేదవాడిని’ - సుప్రీంలో ఓ లాయర్‌ వింతవాదన!

గతంలో విధించిన రూ.50 వేల జరిమానాను తొలగించాలని అశోక్‌పాండే అనే న్యాయవాది చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.

Updated : 09 Jul 2024 17:52 IST

దిల్లీ: అసంబద్ధ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన ఓ న్యాయవాదిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది. తనను క్షమించి, గతంలో విధించిన జరిమానాను తొలగించాలని లఖ్‌నవూకు చెందిన అశోక్‌పాండే అనే న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. తీవ్రంగా మందలించింది. అయినా పట్టువీడకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. ఆదేశాలు పాటించకుంటే ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది.

సుప్రీం కోర్టు న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో గతేడాది ఓ పిల్‌ దాఖలు చేశారు. దాన్ని అసంబద్ధమైనదిగా పేర్కొంటూ కోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. అదేవిధంగా ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని ఆయన సవాలు చేశారు. దీనిపైనా సుప్రీం ధర్మాసనం.. రూ.లక్ష జరిమానా విధించింది. అంతకుముందు ప్రమాణ స్వీకార సమయంలో ‘ఐ’ చెప్పలేదని పేర్కొంటూ బాంబే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణ స్వీకారాన్ని సవాలు చేశారు.

నేను పేదవాడిని..

గతంలో విధించిన రూ.50 వేల జరిమానాను తొలగించాలని న్యాయవాది అశోక్‌పాండే చేసిన అభ్యర్థనను జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జీ మాషీలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ‘‘జరిమానా విధించగానే విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు లాయర్‌గా ప్రాక్టీస్‌  చేస్తూనే.. రూ.50వేలు చెల్లించలేనని చెబుతున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందుకు బదులిచ్చిన న్యాయవాది..‘‘పిల్లలు ధనికులే. కానీ, నేను పేదవాడిని. ఏడాది నుంచి ఒక్క కేసు కూడా లేదు. నా పిల్లల ఖర్చుతోనే విదేశాలకు వెళ్లా’’ అని వివరించే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోని కోర్టు.. రెండు వారాల్లో సదరు మొత్తాన్ని చెల్లించాల్సిందేనని, లేదంటే ధిక్కరణ నోటీసు ఇస్తామని హెచ్చరించింది.

ఆవాస్‌ యోజన డబ్బు చేతికి.. భర్తలను వదిలేసి లవర్స్‌తో జంప్‌!

మరో కేసులో రూ.లక్ష జరిమానా చెల్లించకపోవడంపై జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం సదరు లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎన్ని కోర్టులు మీకు జరిమానా వేయాలి?’’ అని మందలించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు