Manipur: మణిపుర్‌లో అమిత్‌ షా సమీక్ష.. శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవ్‌!

మణిపుర్‌లో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎటువంటి వారిపైనైనా కఠినంగా వ్యవహరిస్తామని.. రాష్ట్రంలో శాంతి నెలకొల్పడమే ప్రభుత్వ ప్రాధాన్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు.

Published : 30 May 2023 21:56 IST

ఇంఫాల్‌: మణిపుర్‌లో శాంతిని నెలకొల్పడమే ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యమని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎటువంటి వారిపైనైనా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నాలుగు రోజల పర్యటనలో భాగంగా అక్కడి ఉన్నతాధికారులతో భేటీ అయిన అమిత్‌ షా.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

‘పోలీసు, కేంద్ర సాయుధ బలగాలు (సీఏపీఎఫ్‌)తోపాటు రాష్ట్రంలోని ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాం. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడమే తొలి ప్రాధాన్యం. శాంతికి ఆటంకం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించా’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. పలు వర్గాల ప్రజలతోనూ చర్చలు జరిపానన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులపై చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పందించారు. రాష్ట్రంలో హింసకు రెండు జాతుల మధ్య వైరమే కారణమని.. దానికి వేర్పాటువాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఇప్పటికే తాము పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడామని.. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం పడుతుందన్నారు.

మరోవైపు, మణిపుర్‌ హింసలో బాధిత కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు అక్కడ పర్యటించేలా అనుమతి ఇవ్వాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ఓ పరిష్కార మార్గం చూపాలంటూ మణిపుర్‌కు చెందిన 10 మంది జాతీయస్థాయి అథ్లెట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. అందులో ఒలింపిక్‌ పతక విజేత మీరాబాయ్‌ చానూ (Meerabai Chanu) కూడా ఉన్నారు. రాష్ట్రంలో తిరిగి సాధారణ పరిస్థితులు రాకపోతే తమ పతకాలను వెనక్కి ఇచ్చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు మీరాబాయ్‌ చానూతోపాటు పద్మ అవార్డు విజేత, వెయిట్‌లిఫ్టర్‌ కుంజరాణి దేవి, భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ సారథి బెమ్‌బెమ్‌ దేవి, బాక్సర్‌ సరితాదేవి తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని