2000 Notes: మామిడి పండ్ల నుంచి.. మోడల్ వాచీల వరకు.. అన్నిటికీ ₹2000 నోటే!

రూ.2000 నోట్లను వెనక్కి తీసుకున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించిన తర్వాత చాలా మంది ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా రూ.2000 నోటే ఇస్తున్నారు. కొందరు వ్యాపారులు దీనిని అనుకూలంగా మలచుకోగా.. కొందరు మాత్రం ఆ నోట్లు తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు.

Published : 23 May 2023 20:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రూ.2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 30 తర్వాత ఈ నోట్ల చలామణిని నిలిపివేస్తామని ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది బ్యాంకులకు వెళ్లి మార్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం బ్యాంకుల వద్ద క్యూల్లో నిలబడలేక సరకులు, బ్రాండెడ్‌ వస్తువులను కొనుగోలు చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. బ్యాంకుల వద్ద క్యూల్లో నిల్చొని వాటిని డిపాజిట్‌ చెయ్యడమో.. లేదంటే మార్పిడి చేసుకునే బదులు అవసరమైన వాటిని కొనుగోలుచేసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు.

ఆర్బీఐ నుంచి ప్రకటన వెలువడిన తర్వాతి రోజు నుంచే పలువురు తమ వద్దనున్న రూ.2000 నోట్లను ఏదోవిధంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని వ్యాపారులు కూడా తమకు అనుకూలంగా మలచుకొంటున్నారు. అయితే, కేవలం మంగళవారం మాత్రమే నోట్లను తీసుకునేందుకు వ్యాపారులు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది మామిడి పండ్లు కొనుక్కునేందుకు కూడా రూ.2000 నోటు ఇస్తున్నారని ముంబయిలోని మహ్మద్‌ అజర్‌ అనే పండ్ల వ్యాపారి పేర్కొన్నాడు. ‘‘ రోజులో నాకు దాదాపు 8 నుంచి 10 రూ.2వేల నోట్లు వస్తున్నాయి. వాటిని నేను కచ్చితంగా తీసుకోవాల్సి వస్తోంది. లేదంటే నా వ్యాపారం దెబ్బతింటుంది. అలాగని నాకేం భయం లేదు.. సెప్టెంబరు 30లోగా వాటిని బ్యాంకులో డిపాజిట్‌ చేసేస్తాను’’ అని చెబుతున్నాడు.

ఆతడొక్కడే కాదు.. ఆర్బీఐ నుంచి ప్రకటన వెలువడినత తర్వాత కొనుగోళ్లు పెరిగినట్లు ప్రముఖ వ్యాపార సంస్థలు కూడా చెబుతున్నాయి. ప్రకటన వెలువడిన నాటి నుంచి..తమ స్టోర్‌లో ₹2వేల నోట్ల వాడకం 60-70 శాతం పెరిగిందని సెంట్రల్‌ ముంబయిలోని ఓ ప్రముఖ స్టోర్‌ మేనేజర్‌ మిచెల్‌ మార్టిస్‌ మీడియాకు వెల్లడించారు. గతంలో రోజుకు 1 లేదా 2 బ్రాండెడ్‌ వాచీలను విక్రయించగా.. ప్రస్తుతం 3 నుంచి 4 వాచీలు అమ్ముతున్నట్లు తెలిపారు. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో.. క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్లలో దాదాపు 72 శాతం మంది రూ.2000 నోట్లే ఇస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించింది. అయితే, కొందరు వ్యాపారులు మాత్రం రూ.2వేల నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంతోనే వారు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఈ నోట్ల మార్పిడి ప్రక్రియను 2016 నాటి నోట్ల రద్దుతో పోల్చుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. నోట్ల రద్దు సమయంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లతో పోలిస్తే.. ప్రస్తుతం రూ.2,000 నోట్ల వాటా చాలా తక్కువని, మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతం మాత్రమేనని ఆర్‌బీఐ సైతం తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లుబాటు కాలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రూ.2,000 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఎలాంటి లావాదేవీకైనా దీన్ని ఉపయోగించుకోవచ్చని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని