రెండు బోగీల మధ్య నిలబడి.. రైల్లో ప్రమాదకర ప్రయాణం!

బిహార్‌లోని ఓ రైలు ప్రయాణికులతో రద్దీగా మారడంతో మరికొందరు రెండు బోగీల మధ్య నిలబడి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Published : 18 Jun 2024 17:49 IST

(Photo source: Mr.vishal_sharma_)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఎంచుకునేది రైలు ప్రయాణాన్నే. ఈ క్రమంలో పలు మార్గాల్లో రైళ్లు మాత్రం విపరీతమైన రద్దీతో కిక్కిరిసిపోతుంటాయి. కనీసం ఎక్కడానికి కూడా చోటు లేని పరిస్థితులు చూస్తుంటాం. ఇలా బిహార్‌ (Bihar)లోని ఓ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రమాదకర రీతిలో పరుగెడుతూ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

బిహార్ నుంచి పంజాబ్‌కు ప్రయాణించేందుకు రైలు సిద్ధమైంది. చూస్తుండగానే ప్రయాణికులతో సీట్లన్నీ నిండిపోయాయి. కూర్చునేందుకు స్థలం లేకపోవడంతో కొందరు ద్వారాలకు అడ్డుగా వేలాడడం వీడియోలో కనిపిస్తోంది. మరికొందరు ఏకంగా రెండు బోగీల కప్లింగ్‌ ప్రదేశంలో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. ఇంకొందరు రైలు వెంట పరుగెడుతూ లోనికి చేరే ప్రయత్నం చేశారు. పక్కనున్న వారు ఎంత వారించినా వినిపించుకోకుండా రైలు ఎక్కేందుకే యత్నించారు. ఈ పరిస్థితి సామాన్యులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రయాణికుడి ఆహారంలో ‘బ్లేడ్‌’ నిజమే.. అంగీకరించిన ఎయిర్‌ ఇండియా

ఈ వీడియోను విశాల్‌ శర్మ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రయాణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘రోజూ ఇలానే ఉంటే.. బిహార్‌ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం ఎప్పుడు దొరుకుతుంది’’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘‘ఈ సమస్యపై రైల్వేశాఖ వెంటనే దృష్టి సారించాలని’’ మరో నెటిజన్‌ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని