Babul Supriyo: భాజపా అహాన్ని ప్రజలు దెబ్బకొట్టారు: బాబుల్‌ సుప్రియో

ప్రజలు భాజపా అహంపై దెబ్బ కొట్టారని మాజీ ఎంపీ, బల్లిగంజ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో వ్యాఖ్యానించారు. ఇటీవల బెంగాల్‌లో జరిగిన ఉప.....

Published : 17 Apr 2022 02:00 IST

కోల్‌కతా: ప్రజలు భాజపా అహంపై దెబ్బ కొట్టారని కేంద్ర మాజీ మంత్రి, బల్లిగంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో వ్యాఖ్యానించారు. ఇటీవల బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆయన 20,228 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా బాబుల్‌ సుప్రియో మాట్లాడుతూ.. గతంలో అసన్‌సోల్‌లో నుంచి భాజపా తరఫున ఎంపీగా పోటీ చేసి తన సొంత ఇమేజ్‌పైనే గెలిచానన్నారు. ఇప్పుడు బల్లిగంజ్‌లో ఎమ్మెల్యేగా సాధించే విజయానికి సంబంధించిన క్రెడిట్‌ అంతా మమతా బెనర్జీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. బల్లిగంజ్‌లో బాబుల్‌కు 51,199 ఓట్లు రాగా.. సీపీఎం అభ్యర్థికి 30,971 ఓట్లు, భాజపా అభ్యర్థికి 13,220 ఓట్లు వచ్చాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్‌సోల్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన బాబుల్‌ సుప్రియో.. ఆ తర్వాత తన పదవికి, భాజపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే, గతేడాది బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ అనారోగ్యంతో మృతిచెందడంతో ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఏప్రిల్‌ 12న రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘం.. ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ బల్లీగంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి బాబుల్‌ సుప్రియో, అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రసిద్ధ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్నసిన్హను బరిలోకి దించింది. మరోవైపు, శత్రుఘ్నసిన్హ దాదాపు 3లక్షల ఓట్ల పైగా ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు.

ఓటర్లకు దీదీ సెల్యూట్‌!

ఈ రెండు స్థానాల్లో నిర్ణయాత్మక తీర్పు ఇచ్చినందుకు ఓటర్లకు సీఎం మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తాము ఇచ్చిన మా, మానుష్‌, మట్టి నినాదానికి బెంగాల్‌ కొత్త సంవత్సరానికి ప్రజలు ఇచ్చిన కానుక అన్నారు. తమపై విశ్వాసం ఉంచి మరోసారి గెలిపించినందుకు ఓటర్లకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని