COVID-19: దిల్లీలో పెరుగుతున్న కేసులు.. నిపుణులు చెబుతున్న కారణాలివే..

దిల్లీలో కేసుల పెరుగుదలకు కారణాలను నిపుణులు తాజాగా వెల్లడించారు. కొవిడ్‌ నుంచి కాపాడే మాస్కులను ధరించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని

Published : 10 Jun 2022 19:32 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిరోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. క్రియాశీల రేటు క్రమంగా అధికమవుతోంది. ముఖ్యంగా దిల్లీలో కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలోనే హస్తినలో కేసుల పెరుగుదలకు కారణాలను నిపుణులు తాజాగా వెల్లడించారు. కొవిడ్‌ నుంచి కాపాడే మాస్కులను ధరించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనికితోడు విచ్చలవిడిగా తిరగడమే కేసుల విజృంభణకు ప్రధాన కారకాలుగా పేర్కొన్నారు.

ఆర్‌ఎల్‌ఎం ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ బీఎల్‌ షెర్వాల్‌ మాట్లాడుతూ.. ‘ఎవరూ మాస్కులను ధరించడం లేదు. మాస్కులు లేకుండానే విహారయాత్రలు చేస్తూ, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇది భారీగా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది’ అని అన్నారు. ‘వైరస్‌కు గురైనవారు మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారు. కొందరిలో జ్వరం, ఒంటి నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకపోవడం ఊరటనిచ్చే అంశం. దీంతో ఆక్సిజన్‌ అవసరం లేకుండా ఉంది’ అని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయితే ఆరోగ్యం బాగా క్షీణిస్తే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

సెలవుల సీజన్‌ కావడం దిల్లీలో కొవిడ్‌ కేసుల పెరుగుదలకు కారణమని సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ ఎస్‌కే అరోఢా తెలిపారు. ‘ఇది సెలవుల కాలం కాబట్టి ప్రజల ప్రయాణాలు, విహారయాత్రలు పెరిగాయి. ఒకరాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతున్నారు. అందుకే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది’ అని అన్నారు. దిల్లీలో గురువారం 622 మంది వైరస్‌ బారిన పడగా.. ఇద్దరు మృతిచెందారు. పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. జూన్‌ 1న 368 కేసులు బయటపడగా.. పది రోజుల్లోకే కేసులు రెట్టింపయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని