Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు

Odisha Train Targedy: ఒడిశా రైలు ప్రమాదంలో వేలాది మంది క్షతగాత్రులు ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వారిని కాపాడేందుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని వారికి రక్తదానం చేస్తున్నారు.

Updated : 03 Jun 2023 15:15 IST

బాలాసోర్‌: ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. గాయపడిన వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. (Odisha Train Targedy)

బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900 మందికి పైనే గాయపడ్డారు. క్షతగాత్రులను బాలేశ్వర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ పరిస్థితుల్లో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువకులు నిన్న రాత్రే బాలేశ్వర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వీరంతా ఏ పిలుపూ లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి మరీ.. క్షతగాత్రులకు రక్తదానం (Blood Donation) చేస్తున్నారు.

స్థానికుల సత్వర చర్యలు..

ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు చురుగ్గా స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ‘‘ప్రమాదం గురించి తెలియగానే మేం వెంటనే అక్కడకు బయల్దేరాం. దాదాపు 200-300 మందిని కాపాడగలిగాం’’ అని ఓ స్థానికుడు మీడియాతో అన్నారు.

200 అంబులెన్స్‌లు..

ప్రమాద స్థలంలో భారత సైన్యం (Indian Army) ముమ్మర సహాయకచర్యలు చేపట్టింది. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి శరవేగంగా ఆసుపత్రులకు తరలించేందుకు 200 అంబులెన్స్‌ (Ambulance)లను ఘటనాస్థలంలో ఏర్పాటు చేశారు. ఇందులో 167 వరకు 108 వాహనాలు కాగా.. 20కి పైగా ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటితో పాటు 45 మొబైల్‌ హెల్త్‌ బృందాలు ఘటనాస్థలంలో అందుబాటులో ఉన్నాయి. అదనంగా మరో 50 మంది వైద్యులను కూడా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని