
పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్‌ను అధిగమించండిలా!
కరోనా బారిన పడ్డవారిలో వైరస్ విలయానికి తోడుగా మరిన్ని విపత్తులు వచ్చిపడుతున్నాయి. దేహాన్ని సమస్యల కుప్పగా మార్చి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొవిడ్ తగ్గిపోయినా దాని తాలూకు లక్షణాలు నెలల తరబడి ఉంటున్నాయి. దీంతో ఒంట్లో వైరస్ ఇంకా తగ్గలేదని చాలా మంది మానసికంగా తీరని వ్యధకు లోనవుతున్నారు. చాలా మందిలో వైరస్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు బాగా మందగించి పోతోంది. పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ బాధలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షణాలివే
సాధారణంగా కరోనా సోకిన తర్వాత మనలో చాలా మంది రెండు వారాల్లోపే వైరస్ నుంచి బయటపడుతున్నారు. ఈలోపే వైరస్ తాలూకు లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోతుంటాయి. అయితే కొంతమందిలో మాత్రం కరోనా వచ్చి మళ్లీ నెగెటివ్ అయినప్పటికీ.. కూడా వైరస్ తాలూకు లక్షణాలు పూర్తిగా తగ్గడం లేదు. ఈ రకమైన పరిస్థితిని వైద్యులు పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ అని పిలుస్తున్నారు. కొద్దిగా ఒళ్లు నొప్పులు ఉండటం, జ్వరం వచ్చినట్లుగా అనిపించడం, బాగా నిస్సత్తువగా నీరసంగా ఉండటం, ఆయాసం వస్తుండటం వంటి వివిధ లక్షణాలు ఈ పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్‌లో కనపడతాయి. నిజానికి ఈ లక్షణాలు ఎంత మాత్రం ప్రాణాంతకం కావని వైద్యులు చెబుతారు. కరోనా తగ్గిన తర్వాత మూడు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరం. ఊపిరితిత్తుల పనితీరు ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా సామర్థ్యం మరింత తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తారు. ఎసిడిటీ ఉంటే పడుకున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది.
ఈ జాగ్రత్తలు మరవద్దు
కొవిడ్ వ్యాధి బారిన పడిన తర్వాత వారం నుంచి రెండు మూడు వారాల్లోపు 94శాతంమంది రికవరీ అవుతున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని నెలల వరకు ఈ మహమ్మారికి సంబంధించిన వీక్ వైరస్ దేహంలో తిష్ట వేసుకుని ఉంటుంది. అది ప్రభావవంతమైన స్టేజీలో ఉంటుందా లేదా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. కానీ యూరిన్ స్టూల్స్లో కూడా వైరస్ స్ట్రెయిన్స్ బయటకు వస్తున్నాయి అనే విషయం మాత్రం శాస్త్రీయంగా నిర్దారించారు. కాబట్టి అంతర్జాతీయ ప్రొటోకాల్ ప్రకారం వ్యాధి బారిన పడి కోలుకున్న తర్వాత కూడా మాస్కు ధరించడం, శానిటేషన్ చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం, ప్రాణాయామం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రాణాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వీటితో పాటు భారత ప్రభుత్వం నిర్దారించిన ఆయుష్ ప్రొటోకాల్‌లో పేర్కొన్న గోల్డెన్ మిల్క్, కషాయం తీసుకోవడమూ మంచిదే. రెగ్యులర్‌గా ముక్కులో ఒక చుక్క కొబ్బరి నూనె వేసుకోవడం ద్వారా నాసల్ కావిటీస్ పనితీరు మెరుగవుతుంది. రకరకాల కూరగాయల్ని ఉడికించి ఆహారంలో తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు ముందే రికవరీ అయి ఉంటారు కాబట్టి.. మిగతా పేషెంట్స్‌ను పాజిటివ్ రీతిలో ప్రోత్సహించడం మంచిది.
- డాక్టర్ భాస్కరరావు, ఆయుర్వేద వైద్యులు
ఇదీచదవండి
నీళ్లనుకుని శానిటైజర్ తాగిన అధికారి!