10 లక్షల మందికి 727 కరోనా కేసులే: కేంద్రం

దేశంలో 135 కోట్ల జనాభా ఉన్నప్పటికీ పదిలక్షల మందికి 727.4 కొవిడ్‌-19 కేసులు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు ఎన్ని కేసులో తీసుకుంటే భారత్‌లో 4-8 రెట్లు తక్కువేనని పేర్కొంది. ....

Updated : 17 Jul 2020 20:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 135 కోట్ల జనాభాలో పదిలక్షల మందికి 727.4 కొవిడ్‌-19 కేసులు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు ఎన్ని కేసులో తీసుకుంటే భారత్‌లో 4-8 రెట్లు తక్కువేనని పేర్కొంది. శుక్రవారం నాటికి ఉన్న యాక్టివ్‌ కరోనా బాధితుల సంఖ్య 3,42,756 మాత్రమేనని వెల్లడించింది. 6.35 లక్షల కన్నా ఎక్కువ మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

కరోనా వైరస్‌ ముప్పుతో దేశంలో ప్రతి పది లక్షలకు 18.6 మంది మరణిస్తున్నారని ప్రపంచంలో ఇదే అత్యల్ప మరణాల రేటని ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమష్టిగా పనిచేస్తున్నాయని తెలిపింది. ఇంటింటి సర్వే, కాంటాక్టుల శోధన, కంటెయిన్‌మెంట్‌, బఫర్‌ జోన్లలో ప్రత్యేక పర్యవేక్షణ, వేగంగా టెస్టులు చేయడం, సమయానికి స్పందిస్తుండటంతో కేసుల్ని త్వరగా గుర్తించగలుగుతున్నామని పేర్కొంది. దాంతో త్వరగా చికిత్స అందించగలుగుతున్నామని వెల్లడించింది.

స్వల్ప, మోతాదు, తీవ్ర లక్షణాలు గలవారిని వర్గీకరించి ప్రామాణికంగా చికిత్స చేస్తున్నామని కేంద్రం తెలిపింది. సమర్థంగా అమలు చేసిన వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చాయని పేర్కొంది. వెంటిలేటర్లపై 1%, ఐసీయూలో 2%, ప్రాణవాయువు సహాయంతో 3% కన్నా తక్కువ మందే చికిత్స పొందుతున్నారని వివరించింది. స్వల్ప లక్షణాలున్న వారిని ఇంటివద్దే ఉంచి చికిత్స అందిస్తుండటంతో వైద్యశాలలు, వైద్యులపై చాలా ఒత్తిడి, భారం తగ్గిందని వెల్లడించింది. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని