Updated : 18 May 2022 23:44 IST

Perarivalan: రాజీవ్‌ గాంధీ హత్య కేసు.. 31ఏళ్ల తర్వాత బయటకు రానున్న దోషి!

ఓ తల్లి పోరాట ఫలితమంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసలు

చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాళన్‌.. సుప్రీం కోర్టు తీర్పుతో 31ఏళ్ల జైలు జీవితం తర్వాత ఎట్టకేలకు బయటకు రానున్నారు. 1991లో రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన సమయంలో 19ఏళ్ల ప్రాయంలో అరెస్టైన పెరారివాళన్‌కు తొలుత మరణశిక్ష పడింది. అయితే, ఎలాగైనా తన కుమారుడిని జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆయన తల్లి ఆర్పుతమ్మళ్‌ చేసిన పోరాటం చివరకు ఫలించినట్లయ్యింది. ఓ వైపు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు ఆమె చేసిన న్యాయపోరాటంలో విజయం సాధించింది. మాజీ ప్రధాని హత్య కేసులో దోషి అయినప్పటికీ.. తన కుమారుడుని రక్షించుకునేందుకు పెరారివాళన్‌ తల్లి చేసిన ప్రయత్నాలను గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

బ్యాటరీల కొనుగోలుతో..

1991 మే 21న అప్పటి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీపై ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడికి లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలమ్‌ (LTTE) సభ్యుడు శివరాజన్‌ కీలక సూత్రధారి అని తేలింది. ఆ బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను (తొమ్మిది వోల్టులు) పెరారివాళన్‌ కొనుగోలు చేసి ఇచ్చారనే అభియోగాలపై అరెస్టయ్యారు. అయితే, ఆ బ్యాటరీలను కొనుగోలు చేసినప్పటికీ వాటి ఉద్దేశం మాత్రం తనకు తెలియదని పెరారివాళన్‌ వాదిస్తూ వస్తున్నారు. ఇక ఈ కేసులో పెరారివాళన్‌కు తొలుత 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించగా.. 2014లో సుప్రీంకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న పెరారివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

స్వేచ్ఛా వాయువులు పీల్చాలని అనుకొంటున్నా..

మూడు దశాబ్దాల తర్వాత జైలు శిక్ష అనుభవించిన పెరారివాళన్‌.. తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పుపై మీడియాతో మాట్లాడారు. ‘మరణశిక్ష అవసరం లేదని బలంగా విశ్వసిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించే ముందు స్వేచ్ఛా వాయువులను పీల్చాలని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు. తన కుమారుడు విడుదలపై మాట్లాడిన అర్పుతమ్మళ్‌.. తనకు తెలియని వాళ్లు కూడా ఎంతో మంది మద్దతు ఇచ్చారని, వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

తీర్పును స్వాగతించిన రాజకీయ పార్టీలు

రాజీవ్‌ హత్య కేసులో పెరారివాళన్‌కు మరణశిక్ష పడినప్పటికీ 2014 సుప్రీం కోర్టు నిలుపుదల చేయడంతోపాటు ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చడంతో దోషుల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. వారితో పాటు తమిళనాడు ప్రభుత్వం కూడా దోషులను విడుదల చేయాలంటూ 2016, 2018లో అప్పటి గవర్నర్లకు సిఫార్సు చేసింది. చివరగా ఆయనను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వాగతించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కూడా సుప్రీంతీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన పెరారివాళన్‌ విడుదలను తమ పార్టీ స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో, పీఎంకే నేత ఎస్‌ రామ్‌దాస్‌, ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్‌తోపాటు ఇతర తమిళ సంఘాలు కూడా పెరారివాళన్‌ విడుదలను స్వాగతించాయి.
Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని