Jallikattu: జల్లికట్టులో దేశీయ జాతుల ఎడ్లనే అనుమతించాలి: మద్రాస్‌ హైకోర్టు

తమిళనాడులో ఏటా ఉత్సాహంగా నిర్వహించే జల్లికట్టు క్రీడలో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే అనుమతించాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిగుమతి చేసుకున్న, హైబ్రిడ్, సంకర జాతులను నిషేధించాలని జస్టిస్‌ ఎన్. కిరుబాకరన్..

Published : 03 Sep 2021 01:53 IST

చెన్నై: తమిళనాడులో ఏటా ఉత్సాహంగా నిర్వహించే జల్లికట్టు క్రీడలో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే అనుమతించాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిగుమతి చేసుకున్న, హైబ్రిడ్, సంకర జాతులను నిషేధించాలని జస్టిస్‌ ఎన్. కిరుబాకరన్, జస్టిస్‌ పి.వేల్‌మురుగన్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తన ఉత్తర్వుల్లో తెలిపింది. పశువుల కృత్రిమ గర్భధారణ ప్రక్రియ అనేది వాటిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడం లాంటిదేనని పేర్కొంది. సహజ సంతానోత్పత్తి ప్రక్రియ అనేది వాటి ప్రాథమిక అవసరం అని, ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పింది. లేనిపక్షంలో అవి యంత్రాల్లా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

చెన్నైకి చెందిన శేషన్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రీడలో పాల్గొనే ఎడ్లు దేశీయ జాతులే అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి పశువైద్యుల నుంచి సంబంధిత ధ్రువపత్రాలు తీసుకోవాలని అధికారులకు కోర్టు సూచనలు చేసింది. ఈ క్రమంలోనే దేశీయ జాతుల పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేలా పాడిరైతులకు రాయితీలు, ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మూగ జీవుల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడల్లా.. వాటి తరఫున న్యాయస్థానం మాట్లాడాల్సి వస్తోందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు క్రీడకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని