NEET UG 2024: నీట్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి

ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Published : 15 Jun 2024 06:13 IST

సుప్రీంకోర్టులో పిటిషన్‌
కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు

దిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం శుక్రవారం కేంద్రం, పరీక్ష నిర్వహించిన జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ), సీబీఐ, బిహార్‌ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా రాజస్థాన్‌లోని కోటా కోచింగ్‌ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ఓ న్యాయవాది ప్రస్తావనకు తీసుకురాగా.. సర్వోన్నత న్యాయస్థానం సున్నితంగా మందలించింది.. ‘‘కోటాలో ఆత్మహత్యలకు నీట్‌ యూజీ ఫలితాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర, భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయొద్దు’’ అని సూచించింది. మరోవైపు నీట్‌ పరీక్షపై వివిధ హైకోర్టుల్లో వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో ఎన్టీఏ పిటిషన్‌ దాఖలు చేసింది. నీట్‌ పరీక్ష మే 5న జరిగింది. అయితే పరీక్షకు ముందు, ఫలితాల తర్వాత పలు అక్రమాలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. పేపర్‌ లీక్, గ్రేస్‌ మార్కులు, పరీక్ష కేంద్రాల విషయంలో అక్రమాలు.. తదితర అంశాలపై కేసులు వేశారు. గురువారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్‌ మార్కులను రద్దు చేస్తున్నామని ఎన్టీఏ ప్రకటించిన విషయం తెలిసిందే.  పేపర్‌ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు వచ్చే నెల 8న విచారణ నిర్వహించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు